అసలే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో… కేంద్రమంత్రులంతా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో అమిత్ షా కూడా రాబోతుండగా, ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. ఈనెల 29న సాయంత్రం 4.10గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని, సాయంత్రం 5.15నిమిషాలకు ఆయన హాకీంపేట నుండి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
అయితే, ప్రధాని గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసమో, పార్టీ కార్యక్రమం కోసమో హైదరాబాద్ రావటం లేదు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తూ, ముందంజలో ఉన్న దేశీయ సంస్థ భారత్ బయోటెక్ సంస్థను సందర్శించేందుకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు ఎంత వరకు వచ్చాయి, సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ పనితీరు ఎలా ఉంది, ఎప్పటిలోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందన్న అంశాలపై ఆయన భారత్ బయోటెక్ లో పర్యటించనున్నారు.
ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ప్రధాని హైదరాబాద్ చేరుకోనున్నారు. హాకీంపేటకు చేరుకోనున్న మోడీ అక్కడి నుండి నేరుగా భారత్ బయోటెక్ సంస్థకు చేరుకోనున్నారు.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారగా… దేశ ప్రజల హితం కోసం వ్యాక్సిన్ పై దృష్టిపెట్టిన ప్రధాని మోడీ పర్యటనను ప్రత్యేకంగా చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.