అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రకటించారు. ”సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రకటిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం మంత్రి వర్గం సమగ్రమైన ప్రణాళికను తయారు చేసింది. మా ప్రభుత్వం శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ను ఏర్పాటు చేసింది. రామాలయ నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో ఈ ట్రస్టే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటుంది” అని ప్రధాన మంత్రి లోక్ సభలో వెల్లడించారు.
”అయోధ్యలో రామాలయ నిర్మాణానికి మనం అందరం మద్దతు నిద్దాం..” అని ప్రకటించారు. ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేయగానే అధికార పార్టీ సభ్యులు బల్లాలు చరుస్తూ ” జై శ్రీరామ్ ” అంటూ నినదించారు. అంతకు ముందు కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే ప్రధాన మంత్రి నేరుగా లోక్ సభకు చేరుకున్నారు.
అయోధ్యలోని వివాద స్థలం మొత్తం రామ్ లల్లా దేవతా విగ్రహానికి సంబంధించినదేనని గత ఏడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ప్రధాన మంత్రి తెలిపారు. రామాయల నిర్మాణానికి మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ఐదెకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది.