బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న నాటునాటు పాటపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ రావడం పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
ఈ చిత్ర బృందానికి ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడంతో యావత్ దేశం గర్వపడుతుందని మోడీ అన్నారు. పాట రాసిన చంద్రబోస్‌కు, సంగీతం అందించిన కీరవాణికి, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తో పాటు దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుందని తెలిపారు. ఈ పాటను ఏళ్లతరబడి ప్రజలు స్మరించుకుంటారని మోడీ అన్నారు.
దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆస్కార్ అనేది ఇప్పటివరకు ఇండియాకు కలగా ఉండేది.. కానీ రాజమౌళి తన విజన్, దైర్యంతో దాన్ని సుసాధ్యం చేశాడు.
వందల కోట్ల భారత గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. నాటునాటు పాట ప్రపంచ అగ్రస్థానన నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి సెల్యూట్ అంటూ చిరు పోస్ట్ చేశారు.