శ్రీమతి కల్వకుంట్ల కవితకు రాయునది ఏమనగా..!

ఒకవైపు బతుకమ్మ ఆడుతూనే.. మరోవైపు.. రాజకీయం చేస్తూ చెమటోడుస్తున్న తెరాస మరో ఆశాకిరణం కల్వకుంట్ల కవిత! నిజామాబాద్ ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా పార్లమెంటేరియన్ గా చరిత్రకెక్కింది. లోక్ సభలో తెలంగాణ గొంతుకను హుందాగా వినిపిస్తోందంటూ ఆమె మీద వరసబెట్టి ప్రశంసలు పడిపోతున్నాయి. ఇవ్వాళ ఆమె 40లోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి13 ఎంపీ కవిత పుట్టినరోజు.

‘శ్రీమతి కల్వకుంట్ల కవిత, మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అంటూ ప్రధాని మోదీ నుంచి ఆమెకు అచ్చతెలుగులో సందేశం అందింది. ”శుభాభినందనలతో నరేంద్ర మోడీ” అని రాసిన లేఖను పీఎంఓ నేరుగా కవితకు అందజేసింది.

కవితకు ప్రశంసా పత్రాలు కొత్త కాదు. ఇటీవల ఏపీకి కేంద్రం చెయ్యాల్సిన సాయంపై ఆమె చేసిన అభ్యర్థనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లాట్ అయిపోయి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గులాబీ దండులో కవిత పాత్ర అత్యంత కీలకం. పార్టీలోపలా బైటా ఆమె పోషిస్తున్న పాత్ర ఎప్పటికప్పుడు బలపడుతూనే వుంది.

నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పట్టున్న సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్ని ఛాలెంజ్ గా తీసుకుని అక్కడ సైతం గులాబీ జెండా ఎగరేయించినప్పుడు కల్వకుంట్ల కవిత ‘నాన్న’ దగ్గర మరిన్ని మార్కులు కొట్టేసింది. గతంలో జీహెచ్ఎంసి ఎన్నికల బాధ్యతను నెత్తికెత్తుకుని పూర్తి స్థాయిలో సక్సెస్ కొట్టిన కేటీఆర్ కి తాను ఏ మాత్రం తీసిపోనని రుజువు చేసుకుంది.

గత డిసెంబర్లో భాగ్యనగరంలో జరిగిన ‘అంతర్జాతీయ తెలుగు మహాసభలు’ సైతం దాదాపుగా కవిత కనుసన్నల్లోనే జరిగినట్లు తెరాస శ్రేణులు చెప్పుకున్నాయి. స్పష్టమైన మాట తీరు.. సునిశితమైన విమర్శ.. సంస్కృతీ సంప్రదాయాల పట్ల నిబద్ధత.. ఇవి మాత్రమే ఆభరణాలుగా మెలిగే కవిత వీలైనంత వరకు వివాదాలకు దూరం పాటిస్తారు.