– ఈమధ్యే కాలం చేసిన 8వ నిజాం
– 9వ నిజాంగా ఆయన కుమారుడు అజ్మత్ ఝా?
– ఆదుకోవాలని అసఫ్ జాహీ వంశస్థుల వినతి
– కఠిక పేదరికంలో మొదటి ఆరుగురు నిజాం వారసులు
– మొత్తం 4వేల మందిగా గుర్తింపు
– నెలవారీ భత్యం పెంచాలని వినతి
– 6 దశాబ్దాలకు పైగా వివాదంలో భూములు
హైదరాబాద్ 9వ నిజాంగా అజ్మత్ ఝా ను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 15న అధికార ప్రకటన ఉంటుందని సమాచారం. ముకర్రమ్ ఝా మొదటి భార్య పెద్ద కుమారుడే వారసునిగా కొనసాగనున్నారు. అయితే.. మొదటి ఆరుగురు నిజాం రాజుల వారసులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారని మజ్లిస్-ఎ-సాహెబ్జాదగన్ సొసైటీ సభ్యులు అంటున్నారు.
4 వేల మంది అసఫ్ జాహీ వారసులకు రూ.20 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే నెలనెలా భత్యం అందుతోంది. దీన్ని పెంచాలని కాబోయే నిజాం వారసునికి విజ్ఞప్తి చేశారు సొసైటీ సభ్యులు. ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ వాగ్దానం పూర్తి చేయాలని వేడుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆచార వారసత్వ ఉత్సవానికి అన్ని కుటుంబాలను ఏకం చేస్తున్నట్లు తెలిపారు.
మొదటి ఆరుగురు నిజాం వారసులు కఠిక పేదరికంలో బతుకు ఈడుస్తున్నారు. సర్ఫ్-ఎ-ఖాస్ ట్రస్ట్ వారు సాహెబ్జాదా లబ్దిదారుల లిస్ట్ రెడీ చేస్తున్నారు. తగిన గుర్తింపు రాబోతుందని సొసైటీ జనరల్ సెక్రటరీ మహ్మద్ మెయిజుద్దీన్ ఖాన్ తెలిపారు.
మరోవైపు కుటుంబాల భూములపై కోర్టులో 60 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. సీఎస్-7, సీఎస్ -14 భూములు ప్రైవేట్ వేనని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టత ఇచ్చింది. అనేక మార్లు అమ్మకాలు జరపడం.. గోల్డ్ స్టోన్ ప్రసాద్ 98 ఎకరాలకు జీపీఏ చేసుకుని అమ్ముకోవడంతో నిజాం కుటుంబాల పేరు మీదున్న భూముల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.