శివకార్తికేయన్.. ఈ పేరు టాలీవుడ్ లో కూడా పాపులర్. ఆయన నటించిన డాక్టర్, డాన్ లాంటి సినిమాలు తెలుగులో కూడా హిట్టయ్యాయి. అందుకే ఇప్పుడు నేరుగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నాడు ఈ హీరో. దాని పేరు ప్రిన్స్. అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఫారిన్ అమ్మాయి మరియా హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఒక హిలేరియస్ వీడియో ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ వీడియోలో.. శివకార్తికేయన్, అనుదీప్ సినిమా ఆలస్యానికి సత్యరాజ్‌ను నిందించారు. అయితే.. సత్యరాజ్ ఎంటరైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. తర్వాత హీరోయిన్ మారియా వచ్చి వారితో మాట కలిపింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలలో ఈ సంభాషణ జరుగుతుంది. చివరిగా.. ఈ దీపావళికి ‘ప్రిన్స్’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించారు. కానీ.. ఆ తేదీని మార్చి, ఇప్పుడు దీపావళికి వస్తున్నట్టు తెలిపారు. సత్యరాజ్ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందంటూ ఫన్నీగా కవర్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. జాతి రత్నాలుతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ ప్రమోషనల్ మెటీరియల్ కూడా ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ దీపావళికి విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.