డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి మొదటి ప్రెసిడెంట్. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి జయంతి కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించాలి. కానీ ఆ యూనివర్సిటీ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శృతి తప్పారు. గౌరవ ప్రదంగా వ్యవహరించాల్సింది పోయి ఆయన జయంతికి ఐటమ్ డ్యాన్స్‌లు చేశారు. దీంతో ఉద్యోగాలు ఊస్టింగ్ అయ్యాయి.
బీహార్‌లోని చాప్రా అనే ప్రాంతంలో ఉన్న రాజేంద్ర కాలేజ్ లో డిసెంబర్ 3వ తేదీన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన పేరిటే కాలేజీ ఉంది కాబట్టి ప్రతి ఏటా ఆయన జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఏమనుకున్నారో తెలియదు కానీ.. ఈసారి మాత్రం ఆయన జయంతి సందర్భంగా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రమేంద్ర రంజన్ సింగ్ సహా మరో 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఐటమ్ డ్యాన్స్‌లు చేశారు.
అయితే ఆ విషయం తెలుసుకున్న జయ ప్రకాష్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆ మొత్తం మందిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆ రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఈ విషయంలో కలగజేసుకుని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి వారందరూ మరికొద్ది రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వారిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు త్వరలోనే ఆ కమిటీ ఎదుట హాజరు కానున్నారు.