మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ ఫార్మసీ కాలేజీకి చెందిన మాజీ విద్యార్ధి ప్రిన్సిపల్ పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విముక్త శర్మ అనే ఆమెపై పెట్రోలు పోసి సజీవదహనం చేయబోయాడు. ఈ ఘటనలో ఆమెకు 80 శాతం గాయాలు కాగా, అతనికి 40 శాతం ఒళ్ళు కాలింది. ఆసుపత్రిలో విముక్త శర్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
తనకు మార్కుల షీట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని, వెంటనే ఇవ్వాలంటూ అశుతోష్ శ్రీవాత్సవ అనే ఈ మాజీ విద్యార్ధి ఈ నెల 19 న ప్రిన్సిపాల్ విముక్త శర్మతో గొడవ పడ్డాడని ఆమె కూడా అతడిని తీవ్రంగా మందలించడంతో ఆగ్రహంతో ఆమెపై పెట్రోలు పోసి హత్యాయత్నానికి దిగాడని వారు చెప్పారు.
అతడిని వెంటనే అరెస్టు చేసి ఇంటరాగేట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 22 ఏళ్ళ అశుతోష్ ఈ దారుణానికి పాల్పడిన అనంతరం దగ్గరలోని జలపాతంలో కూడా దూకాడని, అతడిని వెంటనే స్థానికులు రక్షించారని పోలీసులు వెల్లడించారు.
తన మార్కుల షీట్ విషయంలో ఇదే విద్యార్ధి కొన్ని నెలల క్రితం ఓ ఫ్యాకల్టీ మెంబర్ పై కత్తితో దాడికి పాల్పడినందుకు అరెస్టయి జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడన్నారు.