తల్లి,తండ్రి,గురువు,దైవం అన్నారు. దైవం కంటే మిన్నైన స్థానం గురువుది. సమాజానికి ఆదర్శంగా ఉంటూ భావితరాలకు ప్రగతి బాటలు వేయాల్సిన టీచర్లు గురువులు సంయమనం కోల్పోతున్నారు. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు తామేంటో మర్చిపోయి శిగపట్లు పట్టారు.
విద్యార్థులు చూస్తున్నారనే స్ఫృహలేకుండా వీధి రౌడీలను మించి కొట్టుకున్నారు. ఉపాధ్యాయలోకానికి, సమాజానికి మాయని మచ్చతెచ్చే సంఘటన బిహార్ రాష్ట్రం పాట్నాలో జరిగింది.
విచక్షణ కోల్పోయిన సదరు వివాదం రచ్చకెక్కింది. ఉన్నతాధికారుల వద్దకు చేరుకుంది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని బిహ్తా బ్లాక్ కౌరియా పంచాయతీలోని పాఠశాలలో కాంతి కుమారి ఇన్ఛార్జ్ హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు.
అదే పాఠశాలలో అనితా కుమారి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం నడుస్తోంది. దీనిపై గురువారం ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం మొదలైంది.
ఆ విషయం ఎంత వేడెక్కిందంటే, కొద్దిసేపటికే టీచర్లిద్దరూ ఒకరితో ఒకరు కొట్టుకోవడంతో పాఠశాల ఆవరణ కుస్తీ వేదికగా మారింది. వీరిద్దరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది.
ఎంతలా అంటే.. ఒకరి జుట్టును ఒకరు లాగ్కుంటూ.. పిడిగుద్దుల వర్షం కురిపించుకుంటూ.. కాళ్లతో తన్నుకుంటూ గొడవకు పాల్పడ్డారు. ఈ సమయంలో అక్కడున్న గ్రామస్థులు ప్రేక్షకులు మౌనంగా ఉండిపోయారు.
ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారి రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇద్దరు మహిళా ఉపాధ్యాయుల మధ్య గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తోందన్నారు.
అయిదు నెలల క్రితం కూడా ఈ విషయమై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి, పంచాయతీ ప్రతినిధుల మధ్య సమావేశం నిర్వహించి సద్దుమణిగిన నేపథ్యంలోమరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఉపాధ్యాయులిద్దరినీ బదిలీ చేయాలని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారిని కోరారు. ఈ విషయంపై బిహ్తా బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నభేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఘటన బ్లాక్‌లోని కౌరియా పంచాయతీ మిడిల్ స్కూల్‌కు సంబంధించినది.
ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వ్యక్తిగత వివాదం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, ఆ తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.