దేశం ముందున్న ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడమే తన ప్రథమ కర్తవ్యమని భారత కొత్త ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. సైన్యం క్రియాత్మక సామర్థ్యాన్ని పెంచడానికి సంస్కరణలు, దాని పునర్నిర్మాణంపై దృష్టిసారించనున్నట్టు ఆయన తెలిపారు.
సైనిక రంగంలో స్వావలంబన, ఆధునీకరణపై తాము ఫోకస్ చేయనున్నట్టు వివరించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ భారత ఆర్మీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
సౌత్ బ్లాక్ లో ఆయన గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన… ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో దేశానికి ఎదురయ్యే సవాళ్లను వాయుసేన, నేవిలతో కలిసి సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. భారత సైన్యాన్ని ముందుండి నడిపించడం తనకు గర్వకారణమని తెలిపారు.
దేశ రక్షణలో ఆర్మీ కీలకమైన పాత్ర పోషిస్తుందని, ఆర్మీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. దేశ నిర్మాణంలోనూ ఆర్మీ పాత్ర మరిచిపోలేనిదన్నారు.