చాలా వరకు రోడ్డు ప్రమాదాలు రాత్రి సమయంలో లేదా తెల్లవారుజామున జరుగుతుంటాయి. డ్రైవర్ల తీవ్ర అలసట, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా 20 మంది ఆస్పత్రి పాలయ్యారు. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్‌పేట వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై.. బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆరంజ్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బాపట్లకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవరు నిద్ర మత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రమాదం సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందుతుందని.. పలువురికి తీవ్రగాయలయ్యాయని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.