ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వచ్చిన ఓ కానిస్టేబుల్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి షాకిచ్చింది. ముందుగా డబ్బులు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని తెగేసి చెప్పింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తర్వాత చెల్లిస్తామని, ముందుగా చికిత్స చేయాలని కోరినా.. తాము చేయలేమని అడ్వాన్సుగా డిపాజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పి నిర్ఘాంతపోయేలా చేసింది.
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రివనం వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ కులకర్ణి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ ద్విచక్ర వాహనం ఆయన్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే సమీపంలో ఉన్న ప్రైమ్ హాస్పిటల్‌కు తరలించారు.
కానిస్టేబుల్‌కు వైద్యం అందించాలంటే.. ముందుగా డబ్బులు చెల్లించాలని ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం డిమాండ్ చేసింది. హైదరాబాద్ సిటీ అదనపు ట్రాఫిక్ సీపీ చౌహన్ ఆస్పత్రికి యాజమాన్యానికి ఫోన్ చేసి చికిత్స చేయాలని కోరినా వినలేదు. దీంతో కానిస్టేబుల్‌ను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆత్యవసర సమయంలో ఆస్పత్రి యాజమాన్యం.. బేరసారాలకు దిగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.