ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో దాని గమ్యస్థానానికి బయలుదేరింది. బస్సు అంత ప్రయాణికులతో గందరగోళంగా మారింది. అయితే, సాఫీగా సాగుతోందనుకున్నా వారి ప్రయాణానికి రవాణా అధికారులు బ్రేక్ వేశారు. బస్సును సీజ్ చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. ఇంతకీ ఎందుకో మీరే తెలుసుకోండి.
హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న బస్సు నిర్మల్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో బస్‌సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద రవాణా అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, బస్సులో ఉన్న ప్రయాణికులను చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. బస్సులో ఏకంగా 160 మంది ప్రయాణికులు ఉన్నారు. అది సాధారణంగా ఉండాల్సిన ప్రయాణికులంటే నాలుగింతలు ఎక్కువని అధికారులు తెలిపారు.
దీంతో రవాణా అధికారులు బస్సును సీజ్ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులు బస్‌లో ఉండటమే కారణమని చెబుతున్నారు. 40 మంది ప్రయాణికులకు అనుమతి ఉన్న వాహనంలో దాదాపు నాలుగింతల ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్య నేరమని వారు చెబుతున్నారు.
అలాగే, ఇలా ప్రయాణించడం సురక్షితం కాదని వివరించారు. అధిక ప్రయాణికులతో వెళ్లేటప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ప్రమాదం ఊహించని స్థాయిలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించి ప్రయాణించే ఏ వాహనమైనా అదుపులోకి తీసుకొని కోర్టుకు అప్పజెబుతామని అధికారులు హెచ్చరించారు.