ప్రధాని మోడీపై రాజ్యసభలో కాంగ్రెస్ సభా హక్కుల నోటీసులు ఇచ్చింది. గత పార్లమెంట్ సెషన్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కే.సీ. వేణుగోపాల్ సభలో ప్రివిలైజ్ మోషన్ నోటీసులు ఇచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడుతూ… నెహ్రూ ఇంటి పేరును వాడేందుకు ఎందుకు సిగ్గుపడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఆర్టికల్ 356ని ప్రయోగించారంటూ మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై మోడీ ఆరోపణలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టేందుకు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు 90 సార్లకు పైగా ఆర్టికల్ 356ని ఉపయోగించారని ఆయన ఆరోపించారు. అందులో ఇందిరా గాంధీ ఒక్కరే 50 సార్లు ఆ ఆర్టికల్ ను ఉపయోగించారని ఆయన పేర్కొన్నారు.
దేశంలో 600కు పైగా సంక్షేమ పథకాలకు గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టారని తాను ఓ పత్రికలో చదివానని మోడీ అన్నారు. ఈ విషయాన్ని తాను ఓ పత్రికలో చదివానని, అది వాస్తవా? కాదా? అనే విషయం మాత్రం తనకు తెలియదని చెప్పారు.