ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 100 మంది మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు కూడా ఉన్నట్టు బీబీసీ తెలిపింది. వీరిలో నటి, ప్రొడ్యూసర్ ప్రియాంక చోప్రా జోనాస్, ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల, బుకర్ విన్నర్ రచయిత్రి గీతాంజలి శ్రీ, సామాజిక సేవా కార్యకర్త స్నేహా జవాలె ఉన్నారు. ఈ సంవత్సరానికి గాను తాము విడుదల చేసిన జాబితాలో వీరి పేర్లను బీబీసీ ప్రస్తావించింది.
2022 ఏడాదిగాను ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతురాలైన మహిళలు ఎవరని మీరు భావిస్తున్నారంటూ గత ఏడాది ప్రతిభావంతులుగా ఎంపికైన 100 మంది మహిళలను ప్రశ్నించగా వారు ఈ పేర్లను నామినేట్ చేసినట్టు వెల్లడించింది. ఇలాంటి ప్రక్రియను బీబీసీ చేపట్టడం ఇదే మొదటిసారి.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి తమ ఇంటర్వ్యూలు, డాక్యుమెంటరీలు, ఫీచర్ల ద్వారా ప్రపంచ దృష్టికి వాటిని తెచ్చేందుకు కృషి చేసిన ఈ మహిళలు ప్రతిభావంతులని పేర్కొంది. మీ టూ ఉద్యమం సందర్భంగా మహిళలంతా సమైక్యంగా గళమెత్తడానికి, వారిని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశానని ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలను బీబీసీ గుర్తు చేసింది.
60 కి పైగా బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఈమె బిగ్గెస్ట్ స్టార్ అని, 2002 లో చిత్ర రంగ ప్రవేశం చేసిన ప్రియాంక, 2015 లో ‘క్వాంటికో’ అనే అమెరికన్ నెట్ వర్క్ డ్రామా సీరీస్ లో నటించిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళ అయిందని వివరించింది. ఇండియాలో తన సొంత చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆమె సినిమాలు నిర్మిస్తుండడమే గాక.. యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా బాలల హక్కుల కోసం ఆమె ఉద్యమిస్తోందని పేర్కొంది. అమెరికాలో 2021 లో యూనిటీ 22 మిషన్ కి సంబంధించిన సబ్ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్ కి ఎంపికైన శిరీష బండ్ల ఈ స్థాయికి ఎదిగిన రెండో భారతీయ మహిళ అని బీబీసీ తెలిపింది. ఇలాగే గీతాంజలి శ్రీ, స్నేహా జవాలె తమ తమ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచినట్టు వివరించింది.