స్టార్ కపుల్ ప్రియాంక చోప్రా-నికో జోనస్ తమ కూతురి ఫోటోను మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. ఇటీవలే సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా ఒక పాపకి జన్మనిచ్చింది. తాజాగా తన భర్త, తన పాపతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా కూతురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఫోటోలో భార్య, కూతురిని చూసి మురిసిపోతూ నిక్ జోనస్ కనిపిస్తున్నారు. వందకు పైగా రోజుల తర్వాత కూతురు తన ఇంటిలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని ప్రియాంక చోప్రా ఆనందాన్ని వ్యక్తం చేసింది. తొమ్మిది నెలల కంటే ముందుగానే జన్మించడంలో ఇన్నాళ్లు ఎన్ఐసీయూలో కూతురిని ఉంచాల్సివచ్చిందని వెల్లడించింది.
‘వంద రోజులకుపైగా ఎన్‌ఐసీయు(నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో గడిపిన తర్వాత ఎట్టకేలకు మా పాప మా ఇంట్లో అడుగుపెట్టింది. కుటుంబం అంటే ప్రత్యేకమైంది. కొన్ని నెలలుగా మా ప్రయాణం సవాలుగా సాగినా ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. కుటుంబంతో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైంది. మా పాప ఎన్నో ఒడిదుడుకులని దాటుకొని ఇంటికొచ్చిన వేళ చాలా సంతోషంగా ఉంది. లాస్ ఏంజిల్స్‌లోని సెడార్ నినాయ్ ఆసుపత్రుల్లో మా పాప కోసం నిస్వార్థంగా పనిచేసిన ప్రతి డాక్టర్, నర్సు, స్పెషలిస్ట్‌లకు నా ధన్యవాదాలు. మా పాపని తల్లి తండ్రులుగా మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం. అలాగే నా జీవితంలో ఉన్న మా అమ్మకి, నన్ను బాగా చూసుకున్న వాళ్లందరికి నా మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికంటే ముందు నన్ను తల్లిగా మార్చినందుకు నా భర్త నికో జోనస్‌కి శుభాకాంక్షలు’ అని ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది.
ప్రియాంక దంపతులు తమ కూతురికి ‘మాల్టీ మేరీ చోప్రా జోనస్’ అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల పేర్లు కలిసొచ్చేలా కూతురికి ఈ పేరు పెట్టుకున్నారు. ఇక ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే.. ప్రియాంక చోప్రా నటించిన ‘శీలా’, ‘కల్పనా చావ్లా’ సినిమాలు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ప్రియాంక నటిస్తున్న ‘జీ లే జరా’ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.