గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రా సుడి ఇప్పుడు మామూలుగా లేదు. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్‌లో అరుదైన గౌరవం దక్కింది. జియో ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (MAMI) ఫిల్మ్ ఫెస్టివల్ చైర్ పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇంతకముందు ఆ స్థానంలో మరో బ్యూటీ దీపికా పడుకొణే ఉండేది. అయితే నాలుగు నెలల క్రితమే ఆమె వైదొలిగింది .
MAMI ట్రస్టీలు.. కో చైర్ పర్సన్ నీతా ముఖేశ్ అంబానీ, ఫిస్టివల్ డైరక్టర్ అనుపమ చోప్రా, అజయ్ బిజ్లీ, ఆనంద్ జీ మహీంద్రా, ఫర్హాన్ అక్తర్, ఇషా అంబానీ, కబీర్ ఖాన్, కౌస్తుబ్ ధావ్సే, కిరణ్ రావు, రానా దగ్గుబాటి, రితేశ్ దేశ్‌ముఖ్, రోహన్ సిప్పి, సిద్ధార్థ్ రాయ్ కపూర్, విక్రమాదిత్య మెత్వానే, విశాల్ భరద్వాజ్, జోయా అక్తర్.. కలిసి ప్రియంకా చోప్రాకు మామి చైర్ పర్సన్‌గా ఓటేశారు. అలాగే బోర్డులో కొత్తగా మరో ఇద్దరు సభ్యులకు చోటు దక్కింది. ఫిల్మ్ మేకర్లు అంజలీ మీనన్, శివేంద్ర సింగ్ దుంగర్‌పూర్ బోర్డులోకి వచ్చారు.
తనకు దక్కిన గౌరవం పట్ల ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. ‘మామి’లోని సభ్యులందరితో కలిసి పని చేస్తానని చెప్పింది. ఫిల్మ్ ఫెస్టివల్‌ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కరోనా కారణంగా వాయిదా పడిన జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్.. 2021 అక్టోబర్- 2022 మార్చి వరకు జరగనుంది.