ఢిల్లీలో జామియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కు సంఘీభావంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఇండియా గేట్ దగ్గర రెండు గంటలు మౌన దీక్షలో కూర్చున్నారు. పార్టీ నాయకులు అహ్మద్ పటేల్, ఎ.కె. ఆంటోని, గులాం నబీ ఆజాద్, రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా తో పాటు వందలాది మంది పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. జామియా యూనివర్సిటీ విద్యార్దులతో పాటు పలు యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్ధులు పాల్గొన్నారు.అయితే విద్యార్ధులు పెద్ద సంఖ్యలో రాకుండా పోలీసులు సమీపంలోని మెట్రో స్టేషన్లను మూసివేశారు.
అంతకు ముందు ప్రియాంక వద్రా దేశ పరిస్థితిపై ట్విట్టర్ లో స్పందించారు.”దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది…పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్ ల్లోకి చొరబడి విద్యార్ధులను కొడుతున్నారు…ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేస్తుంది…మనం రాజ్యాంగం అమలుకు పోరాడుదాం” అంటూ ట్వీట్ చేశారు.
న్యాయ విచారణకు విపక్షాల డిమాండ్ :
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసుల లాఠీచార్జీని ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ సంఘటపై న్యాయ విచారణకు డిమాండ్ చేశాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ…గతంలో ఎన్నో సార్లు విద్యార్ధుల ఆందోళనలు జరిగాయని..ఎప్పుడు కూడా పోలీసులు యూనివర్సిటీలోకి ప్రవేశించలేదన్నారు. వీసీ అనుమతి లేకుండా పోలీసులు క్యాంపస్ లోకి ఎలా ప్రవేశించారని ఆజాద్ ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.