కేంద్రంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలను కేంద్రం టార్గెట్ చేస్తోందని ఆమె అన్నారు. చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్‌లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
కార్యకర్తలంతా ఒకరితో ఒకరు కలిసి సమిష్టిగా పనిచేయాలని ఆమె సూచించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి పెడుతోందన్నారు. విద్వేషపూరిత రాజకీయాలను అధిగమించి, సంఘీభావంతో ప్రేమపూర్వక రాజకీయాలు చేద్దామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు.
నేటితో మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పలు కీలక నిర్ణయాలను ప్లీనరీ తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలు అన్నీ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని తీర్మానం చేశాయి.
ఈ రోజు రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ప్రసంగించనున్నారు. ప్లీనరీ సమావేశాల్లో సోనియాగాంధీ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించారు.
భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగిసిందని అన్నారు.