కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ కు చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ నేతలు ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాగానే ఆమెకు గులాబీ పూలతో స్వాగతం పలికారు.
ఆమె ఈ రోజు ఉదయం 8.30 గంటలకు రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ తోపాటు పీసీఎస్ చీఫ్ మోహన్ మార్కం, కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ప్రియాంక గాంధీ భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కాన్వాయ్ పై బయలు దేరారు. ర్యాలీ సమయంలో దారి పొడవునా ఆమెపై గులాబీలు చల్లారు.
ఆమె వచ్చే దారి గుండా గులాబీ పూలను పర్చారు. కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతానికి ఆమె ఫిదా అయ్యారు. ఘన స్వాగతంపై ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.