హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి పార్టీ అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి ప్రతిభా సింగ్‌తో పాటు పలువురు సీఎం పదవిని ఆశిస్తున్నారు.
ఈ క్రమంలో నూతన సీఎంను ఎంపిక చేయడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. సీఎంగా ఒకరి అవకాశం ఇస్తే మరో వర్గం అసమ్మతి వ్యక్తం చేసే అవకాశాలు వున్నాయి. పైగా బీజేపీతోచేరి పార్టీని ఎక్కడ దెబ్బ కొడతారోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
నూతన సీఎం ఎంపికపై చర్చించేందుకు గాను కాంగ్రెస్ సీనియర్ నేతలు రాజీవ్ శుక్లా, భూపిందర్ హుడా, భూపేశ్ బఘేల్ నిన్న రాష్ట్రానికి వచ్చారు. నూతనంగా ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలతో వారు సమావేశం అయ్యారు. వారితో మాట్లాడి ఎవరికి ఎక్కువ మద్దతు ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం నూతన సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ అధిష్టానానికి కట్టబెడుతున్నట్టు తీర్మానం చేసి పంపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు భుజాలపై వేసుకుని పార్టీని ప్రియాంక గాంధీ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఎన్నికల విజయం తాలుకు క్రెడిట్ ఆమెకె దక్కింది. దీంతో నూతన సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే బాధ్యతను ఆమె హైకమాండ్ కట్టబెట్టినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ ముందు వున్నారు. నిన్న నిర్వహించిన నూతన ఎమ్మెల్యేల సమావేశానికి ముందుకు కూడా ఆమె మద్దతు దారులు బలప్రదర్శన చేశారు.
ఆమెతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేశ్ అగ్నిహోత్రి కూడా సీఎం పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేసులో తాము కూడా ఉన్నామని మరికొందరు నేతలు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది.