కాంగ్రెస్ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫేమ్, మాజీ కంటెస్టెంట్ అర్చన గౌతమ్ ను కులం పేరిట దుర్భాషలాడి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తన కుమార్తెపై అకారణంగా ఆయన చెయ్యి చేసుకునేందుకు యత్నించాడని ఆమె తండ్రి గౌతమ్ బుద్డ్ మీరట్ లోని పార్థాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
నా కూతురిని చంపేస్తానని సందీప్ బెదిరించాడు.. అసభ్యకరంగా మాట్లాడాడు అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఎస్సీ ఎస్టీ చట్టంతో సహా పలు సెక్షన్ల కింద పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిజానికి ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు గత నెల 26 న రాయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు తాను అక్కడికి వెళ్లానని, కానీ తనను సందీప్ సింగ్ అడ్డగించి.. అనుమతించలేదని అర్చన గౌతమ్ తెలిపారు.
ప్రియాంకను కలుసుకునేందుకు సైతం అనుమతి నిరాకరించి.. తనను దూషించాడని ఆమె చెప్పారు. ఆనాడే ఆమె తనకు జరిగిన అన్యాయంపై ఈ సమాచారాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
ఇలాంటివారిని పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తోందో తనకు అర్థం కావడంలేదని, తనలాంటి పార్టీ కార్యకర్తలు ప్రియాంక గాంధీని కలుసుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను పోలీసు లాకప్ లో పెట్టిస్తానని కూడా సింగ్ బెదిరించాడన్నారు. దీనిపై తాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బిగ్ బాస్-16 సీజన్ లో టాప్ 5 ఫైనలిస్టుల్లో అర్చన ఒకరు.