కర్ణాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై వివాదం చెలరేగింది. కాంగ్రెస్ శ్రేణుల తీరుపై కన్నడ అనుకూల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేతల తీరును వారు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాంగ్రెస్ శ్రేణులు తమ తప్పును సరిదిద్దు కోవాలని లేదంటే కన్నడ ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే… కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టి భారత్ జోడో యాత్ర కర్ణాటకకు చేరింది.
మైసూరు సమీపంలో రాహుల్‌ను చూడగానే కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఊగిపోయారు. యాత్ర సాగే ప్రాంతాన్ని బ్యానర్లు, పోస్టర్లు, జెండాలతో పూర్తిగా నింపేశారు. అదే సమయంలో యాత్ర కొనసాగుతుండగా కొందరు పార్టీ కార్యకర్తలు కర్ణాటక జెండాను పట్టుకుని కదిలారు.
కర్ణాటక జెండాపై రాహుల్ గాంధీ బొమ్మను స్థానిక నేతలు ముద్రించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కన్నడ సంఘాలు ఫైర్ అయ్యాయి. ఇది ముమ్మాటికీ కన్నడ ప్రజలను అవమానించడమేనని వారు మండిపడుతున్నారు.
ఇలా కన్నడ జెండాపై రాహుల్ గాంధీ ఫొటోను ముద్రించడాన్ని తాము ఖండిస్తున్నట్టు కన్నడ సంఘాలు తెలిపాయి. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలోనే కన్నడ జెండాను మార్చారని పేర్కొన్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర జెండాపై రాహుల్ బొమ్మను ముద్రించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇది సిగ్గు చేటు అని కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక్ మండిపడ్డారు. కన్నడ జెండాపై ఇలా రాహుల్ గాంధీ బొమ్మను ముద్రించడంపై కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కన్నడ అనుకూల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే వారికి ఎలా గుణపాఠం చెప్పాలో తమకు తెలుసని కన్నడ అనుకూల సంఘాలు చెబుతున్నాయి.