కర్ణాటకలోని పరిశ్రమలు, సంస్థల్లోని ఉద్యోగాల్లో కన్నడిగులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నలబై ఏళ్ల క్రితం డాక్టర్ సరోజిని మహిషి ఇచ్చిన నివేదకను అమలుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప గురువారం ప్రకటించారు. సరోజిని మహిషి నివేదికను అమలు చేయాలని కోరుతూ 113 కు పైగా కన్నడ సంఘాలు, సంస్థలు గురువారం ఉదయం నుంచి 12 గంటల రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం ఎప్పుడూ కన్నడిగుల సంక్షేమం కోసమే ఉందని..వారి కోసం సరోజిని మహిషి రిపోర్ట్ ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
బంద్ పిలుపుతో ఈ రోజు ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సంఘాలు మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు చెందిన బస్సుపై మంగుళూరులోని ఫరంగిపేట్ లో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. క్యాబ్ లు, ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొన్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు యూనివర్సిటీ అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ను వాయిదా వేసింది. కన్నడ రాష్ట్ర కార్యకర్త ను ప్రవీణ్ శెట్టిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కర్ణాటకలోని పబ్లిక్ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీలల్లోని ఉద్యోగాల్లో కన్నడిగులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాజీ కేంద్ర మంత్రి సరోజిని మహిషి 1984 ల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆ నివేదికను అమలు చేయాల్సిందిగా కన్నడిగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.