ఆస్ట్రేలియా లో భారతీయులపై ఖలిస్తానీల దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఇండియాకు వ్యతిరేకంగా ఆ దేశంలో ఖలిస్తానీ ఉద్యమం క్రమంగా వ్యాపిస్తోంది. హిందూ ఆలయాలపై ఖలిస్తానీలు విరుచుకుపడుతూ దేవతా విగ్రహాలను, ఆలయ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 15 రోజుల్లోనే మెల్ బోర్న్ లోని మూడు ఆలయాలపై దాడులు జరిగిన ఘటనలను మరిచిపోక ముందే ఈ నగరంలో భారతీయ జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నవారిపై ఖలిస్తానీ మద్దతుదారులు రాడ్లు, కత్తులతో దాడులకు దిగారు.
ఈ దాడుల్లో అయిదుగురు భారతీయులు గాయపడ్డారు. ఓ భారతీయుని చేతిలోని జెండాను లాక్కుని ఓ ఖలిస్తానీ విరిచివేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియాలో నిషిద్ధ సంస్ధ అయిన సిఖ్స్ ఫర్ జస్టిస్.. ఇటీవల ఖలిస్థాన్ కి అనుకూలంగా మెల్ బోర్న్ లో ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహిస్తుండగా షుమారు 30 మంది యువకులు భారత్ మాతాకీ జై అంటూ ఇక్కడి ఫెడరేషన్ స్క్వేర్ వైపు భారతీయ పతాకాలు పట్టుకుని వచ్చారు.
వీరిని చూడగానే ఖలిస్తానీలు .. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ కర్రలతో దాడికి దిగారు. ఈ దాడులతో కొందరు భారతీయులు భయంతో పరుగులు తీశారు.
అయితే ఆస్ట్రేలియా పోలీసులు కంటితుడుపుగా ఇద్దరు ఖలిస్థాన్ మద్దతుదారులను అరెస్టు చేసి వారిపై కేసు పెట్టారు. వారికి పెనాల్టీ నోటీసు జారీ చేశారు. ఆస్ట్రేలియా లోని భారత హైకమిషన్ కార్యాలయం .. ఈ దాడులపై ఆ దేశ ప్రభుత్వానికి తీవ్ర నిరసన తెలిపినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.