టాప్‌ టు బాటమ్... అంతా జగన్మాయే...? - Tolivelugu

టాప్‌ టు బాటమ్… అంతా జగన్మాయే…?

pro ycp employees appointed in every department from top to bottom after jaganreddy cm, టాప్‌ టు బాటమ్… అంతా జగన్మాయే…?

ఒక్కసారి వారిని ఇంట్లోకి రానిచ్చామంటే.. ఇంట్లో గోడలు, గుమ్మాలు కూడా మార్చేస్తారు. అంగుళం అంగుళం వారి మనిషే ఉంటాడు. తర్వాత అధికారం రాకపోయినా.. మొత్తం ఇల్లు వాళ్ల గుప్పిట్లోనే ఉంటుంది. కొత్త యజమాని ఏమీ చేయలేడు. గతంలో కమ్యూనిస్టులు ఈ విషయం ఎప్పుడు చెబుతుండేవారు. బిజెపిని ఒక్కసారి అధికారంలోకి రానిస్తే మొత్తం సిస్టమ్ లో కీలక పోస్టులన్నీ వాళ్ల మనుషులతో నింపేస్తారని. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారిని అడుగడుగునా నియమిస్తారని చెప్పేవారు. వారు చెప్పినా.. బీజేపీ రావడం ఆగలేదు. అధికారంలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతుంది. కాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వారిని మించినవారు అధికారంలోకి వచ్చారని ఈ ఐదారునెలల్లో అర్ధమైపోయింది.

ప్రతి పోస్టులో వారి మనుషులే. ఐఎఎస్, ఐపీఎస్ లతో మొదలైన ఈ పరంపర క్లర్కులదాకా పోయింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే వచ్చి సలామ్ కొట్టారో.. అప్పుడే కథ మొదలైంది. పోలీసు డిపార్ట్ మెంట్లో మొత్తం వైసీపీ నాయకులు చెప్పిందే వేదం అయిపోయింది. ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా వైసీపీ నేతలకు నచ్చినవారే ఉండాలి.. చెబితే కేసులు పెట్టేవారే ఉండాలి. అంతలా మేనేజ్ చేశారు. ఐఎఎస్ ల్లోనూ ఇదే తంతు నడిచిందన్న ఆరోపణలు వచ్చాయి.

మంత్రుల పేషీల్లోనూ, సెక్రటేరియేట్ లోనూ ప్రతి పోస్టును భారీగా కసరత్తు చేసి మరీ నింపుకున్నారు. అవసరమైనవాళ్లను ఉంచుకోవడం.. మిగిలినవారిని వేరే చోటకు బదిలీ చేయటం. ఆఖరుకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం ఒకేసారి తీసేశారు. ఇప్పుడు కొత్త కార్పొరేషన్ పెట్టి, వారి కనుసన్నల్లోనే మొత్తం నియామకాలు జరిగేలా ప్లాన్ చేశారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా సరే.. ఆ ఉద్యోగి లేదా అధికారి బదిలీ అయిపోక తప్పదు. ఏ వైసీపీ నాయకుడు కంప్లయింట్ చేసినా సరే.. బదిలీ ఆర్డర్ టకటకా టైప్ అయిపోయి వచ్చేస్తుంది.

ఆశ్చర్యం ఏంటంటే.. ఇందులో సామాజిక న్యాయం పాటిస్తున్నారు. ముందు వారి సామాజికవర్గం.. ఆ తర్వాత అందులోనే మతం పుచ్చుకున్నవారు.. ఆ తర్వాత వారి మతం వారు. ఇదీ ప్రియారిటీ. ఇదే లెక్కన నియామకాలు జరిగాయి… జరుగుతున్నాయి. మనం గమనిస్తే.. ప్రెస్ మీట్లలో అధికారులు జగన్ ని పొగిడారంటే ఆ నియామకం గురించి అర్ధం చేసుకోవాలి.

ఈ దెబ్బకు ఎన్నికలకు ముందు కసిగా చంద్రబాబునాయుడిని దింపడానికి పని చేసిన మేధావి వర్గం, ఒక ఉన్నత సామాజికవర్గానికి చెందినవారైతే జగన్ తీరుతో తీవ్రంగా నిరాశ చెందారు. చంద్రబాబునాయుడిపై నిప్పులు కురిపించిన ఐవైఆర్ కృష్ణారావు ఇప్పుడు జగన్ అంటే మండిపడుతున్నారు. ఇంకా అనేకమంది పరిస్ధితి అదే. ఎల్వీ సుబ్రమణ్యం విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారు కూడా. ఇలా ప్రతి మూల, ప్రతి చోట తమ మనుషులను నింపేశారు. తెలుగుదేశం హయాంలో కూడా ఈ ట్రెండ్ ఉంది, కాని వారు గుట్టుగాను కీలకమైనవాటి వరకే చేసేవారు. కాని ఇప్పుడలా కాదు.. గ్రామ వలంటీర్లను కూడా మనం లెక్కేస్తే.. సెక్రటేరియేట్ నుంచి వార్డు దాకా అందరూ వారి మనుషులే అంటే అతిశయోక్తి కాదు.

Share on facebook
Share on twitter
Share on whatsapp