ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్వులతో ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం ఏర్పడిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యమంత్రి తుగ్లక్ పాలనకు ఇది నిదర్శనమన్న ఆయన.. • స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంలో ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్, జూనియర్ పేరుతో ఉద్యోగుల్లో చీలిక తీసుకొస్తూ రాజకీయ లబ్ది పొందే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ప్రమోషన్లు దక్కక, ఇతరత్రా సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పాత సమస్యను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సమస్యను తెరమీదకు తెస్తూ రాజకీయ పబ్బం గడపుకోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు సంజయ్. ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్న సీఎం… ఆ డబ్బుతోపాటు ఉద్యోగుల సమస్యలనూ దాచిపెడుతూ… తనకు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న 317 జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు బండి. వెంటనే ఆయా సంఘాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకున్న తరువాతే జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు జరపాలన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తిని దెబ్బతీయకుండా ప్రభుత్వ నిర్ణయం ఉండాలని చెప్పారు బండి సంజయ్.