– కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న కేంద్రం
– అప్పుల విషయంలో ముప్పుతిప్పలు
– నిధుల కేటాయింపులో ఆంక్షలు
– ఏం చేయాలో తెలియని స్థితి
– కేంద్ర నిర్ణయాలతో సారు ఉక్కిరిబిక్కిరి
కేంద్రంపై ఆరు నెలలకోసారి యుద్ధమనే కేసీఆర్.. తర్వాత ఏం చేస్తారో.. ఇప్పటివరకు ఏం సాధించారో చూశాం. ఆయా సందర్భాల్లో కొద్దిరోజులు హడావుడి చేయడం.. తర్వాత ఫాంహౌస్ కు వెళ్లడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే. అయితే.. కేసీఆర్ ఎన్ని తిట్లు తిట్టినా.. పైకి అంతంతమాత్రంగానే స్పందించే కేంద్రం సైలెంట్ గా తన పని చేసేస్తోంది. ఈ క్రమంలోనే సారుకు చుక్కలు కనపడుతున్నాయి.
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఎప్పుడూ నిధుల పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. కేంద్రం అది ఇవ్వలేదు.. ఇది ఇవ్వడం లేదంటూ కేటీఆర్ మొదలుకొని.. గులాబీ నేతలు ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా తిట్టిపోస్తూనే ఉంటారు. బీజేపీ వర్గాల నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ జరుగుతుంటుంది. బండి సంజయ్ లాంటి నేతలు లెక్కలతో సహా అన్ని ఇచ్చామని చెబుతుంటారు. అయితే.. ఈమధ్య రాష్ట్రానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా టీఆర్‌ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తోందో వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరిగింది. ఓవైపు ఈ యుద్ధం జరుగుతుండగానే ఇంకోవైపు కేంద్రం సైలెంట్ గా చేయాల్సినవన్నీ చేసేసింది.
కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి తెలంగాణ మిగులు నిధుల రాష్ట్రంగా ఉంది. కానీ.. ఇప్పుడు రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఈ ఎనిమిదేళ్లలో అప్పులతో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు తిట్టిపోస్తూనే ఉన్నాయి. అలాగే.. లక్షల కోట్లు తమ కుటుంబానికి, బినామీ సంస్థలకు మళ్లించారని ఆరోపణలు చేస్తున్నాయి. అయితే.. విచ్చలవిడిగా చేస్తున్న అప్పులపై కేంద్రం ఫోకస్ పెట్టడం కేసీఆర్ కు పెద్ద షాకేనని అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రుణాలు తీసుకునేందుకు పరిమితి ఉండటంతో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వాటికి కౌంటర్ గ్యారెంటీగా ఉంటూ పెద్ద ఎత్తున రుణాలు తీసుకుంటోంది సర్కార్. కొన్నేళ్లుగా కేంద్రం నిర్దేశించిన పరిమితిని దాటి దాదాపు రెట్టింపు అప్పులు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అప్పులపై ఆంక్షలు పెట్టింది కేంద్రం. రాష్ట్రానికి ఎంత మేరకు అప్పులు తీసుకోవడానికి అనుమతిస్తారనే విషయమై చర్చలు సాగుతున్నాయి. తాజాగా రూ.4,000 కోట్ల రుణం తీసుకోవడానికి ఇచ్చిన అనుమతి తాత్కాలికంగానే ఉంది. ఈ నెలాఖరు వరకు స్పష్టత రావొచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.
ఇక పంచాయతీల నిధుల విషయంలోనూ కేసీఆర్ కు ఝలక్ ఇచ్చింది కేంద్రం. నేరుగా సర్పంచ్ ల ఖాతాల్లోనే నిధులు వేయాలని నిర్ణయించుకుంది. దీనిపై సర్పంచులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో చాలాచోట్ల బిల్లులు రాక సర్పంచ్ లు అప్పులపాలయ్యారు. చేసిన అప్పులు తీర్చలేక.. వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రప్రభుత్వం ప్రమేయం లేకుండా నేరుగా నిధులు సర్పంచ్ ల ఖాతాల్లో వేయాలని చూస్తోంది. ఈ నిర్ణయంతో షాకైన కేసీఆర్ కేంద్రం తీరును తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే సర్పంచ్ ల్లో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.. కేంద్రం ఇస్తానంటున్న వాటిని అడ్డుకుంటోందని సొంత పార్టీ నేతలే కేసీఆర్ ను తిడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో తమ నిరిసన స్వరాన్ని వినిపిస్తున్నారు.
నిజానికి కేంద్రం ఇన్నాళ్లూ పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వ పీడీ ఖాతాల్లో జమ చేస్తోంది. అక్కడి నుంచి ట్రెజరీ ద్వారా పంచాయతీలు డ్రా చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రక్రియ ఓ ప్రహసనంలా మారింది. ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది. ఇందు కోసం ట్రెజరీ అకౌంట్స్ ను తరచూ ఫ్రీజ్ చేస్తోంది. దీంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు సాగడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేయడం లేదన్న ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా.. అటు నిధులు ఇస్తున్నట్లు హైలెట్ అవుతూనే.. ఇంకోవైపు కేసీఆర్ కు షాకిచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది కేంద్రం.
మరోవైపు ఉపాధి హామీ పథకం నిధులను కూడా కేంద్రం కట్టడి చేస్తోంది. 2 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం లేకుండా… పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. దేశ వ్యాప్త పాలసీ అయినా ఆర్థికంగా పుట్టెడు కష్టాల్లో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర నిర్ణయాలు శరాఘాతంలా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం ఏమోగానీ… ఢిల్లీ పెద్దలు సైలెంట్ గా కేసీఆర్ కయితే చుక్కలు చూపిస్తున్నారని చెబుతున్నారు.