గద్వాల పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఐఏఎస్ రిటైర్డ్, ఎస్డీఎఫ్ కన్వీనర్ ఆకునూరి మురళీ, సంగంరెడ్డి పృథ్వీరాజ్, ఎస్‌డీఎఫ్ కో కన్వీనర్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ సందర్శించి ఆసుపత్రిలోనే నిద్రించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో రోగులతో మాట్లాడారు.
ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవని రోగులు ఆకునూరికి వివరించారు. తగినంత మంది వైద్యులు లేకపోవడం, మంచినీటి సౌకర్యం లేకపోవడం, గైనకాలజీ డాక్టర్లు ఉన్నప్పటికీ వారి వద్ద స్కానింగ్ మిషన్లు లేకపోవడం వంటి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రోగులతో మాట్లాడారు. సమస్యల గురించి ఆరా తీశారు. వైద్యులు కనీసం చేతిని అయినా పట్టుకోకుండా సూది మందు నేరుగా దుస్తులపైనే వేస్తున్నారని రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో పని చేసే వైద్యులు ఉదయం 10 గంటలకు వచ్చి ఒంటిగంట వరకు మాత్రమే ఉంటున్నారని తెలిపారు. ప్రతి వైద్యునికి ప్రైవేట్ క్లినిక్ లు ఉన్నాయని వివరించారు. ఏ చిన్న వైద్యం కోసం వచ్చినా కూడా ఇక్కడ వైద్యం అందించకుండా కర్నూలు ఆసుపత్రికి పంపిస్తున్నారని, సమయానికి ఏ వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండటం లేదని రోగులు వాపోయారు.
Advertisements
కర్నూలుకు వెళ్లాలంటే ప్రైవేట్ అంబులెన్సు తీసుకోవడానికి రూ.4000 ఖర్చు వస్తుందని, తీరా అక్కడికి వెళ్లిన తరువాత తెలంగాణ ఆరోగ్యశ్రీ కార్డు పని చేయదని వారు బాధను వ్యక్త పరిచారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించాలంటే 24 గంటల సమయం పడుతుందని, త్వరగా కావాలంటే బయట చేయించుకోమంటున్నారంటూ రోగులు వాపోయారు. 300 పడకల ఆస్పత్రిలో ఒకే ఒక్క మత్తు డాక్టర్ ఉన్నాడని, కేవలం ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారన్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలాగా చెయ్యాలన్నారు ఆకునూరి మురళి.