కరోనా కాలంలో చేయడానికి పని లేక.. తినడానికి తిండి లేక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దీనికి తోడు ఏదైనా రోగం వస్తే అంతే సంగతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని సుమారు 60 గిరిజన తండాలున్నాయి. 15,857 వరకు జనాభా ఉన్నారు. వాళ్లకు కాలు నొప్పొచ్చినా.. కడుపు నొప్పొచ్చినా.. ప్రభుత్వ దవాఖానాకు పోవాల్సిందే. అలాంటిది వైద్య సదుపాయాలు అందక అనేక అవస్థలు పడుతున్నారు గిరిజనులు.
అయితే వాళ్లకు అందుబాటులో ఉన్న గుండాల సర్కారు దవాఖానా సమస్యలకు పుట్టినిల్లులా మారింది. అన్నీ వ్యవసాయాధారిత గ్రామాలు. పాములు, తేళ్లు కరిచినా ఎక్కువగా ఈ దవాఖానాకే వస్తుంటారు. ప్రతి రోజూ తక్కువలో తక్కువ 200 మంది వరకు హాస్పిటల్కు పేషెంట్స్ వస్తారు. ఏజెన్సీ ఏరియా కావడంతో దవాఖానా 24 గంటలు పని చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కరే డాక్టర్ ఉండటం.. స్టాఫ్ లేకపోవడంతో సమస్యలతో వస్తే ట్రీట్మెంట్ అందటం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు నర్సులు ఉండేవారు. ఏ రాత్రి దవాఖానాకు వచ్చినా ట్రీట్మెంట్ చేసి పంపేవారు. రెండేండ్ల కింద ఒక డాక్టర్ను వేరే హాస్పిటల్కు పంపించారు. ఇద్దరు నర్సులు మరో జాబ్ రావడంతో వెళ్లిపోయారు. అప్పటి నుంచి పేషెంట్లకు అవస్థలు మొదలయ్యాయి. ఇప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న ఒక్క డాక్టర్పై పనిభారం పెరిగింది. దీంతో ఆయన లీవ్ పెట్టినా, ఇంకేదైనా అర్జంట్ పనులపైన ఎక్కడికైనా వెళ్లినా జనాలు ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ అయితే ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుని 60 కిలోమీటర్ల దూరంలోని ఇల్లెందు లేదా 100 కిలోమీటర్ల దూరంలోని ఖమ్మం పోతున్నారు.
ఈ దవాఖానాలో డెలివరీస్ ఎక్కువగా జరుగుతుంటాయి. దీని కోసం లేడీ డాక్టర్ను నియమించాలని చాలాకాలంగా రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నా పట్టించుకునేవారు లేరు. దవాఖానాలో ఒకే ఒక్క రూమ్ ఉండగా ఇందులో నాలుగు బెడ్స్ మాత్రమే ఉన్నాయి. డెలివరీ లేడీస్ తో పాటు ఇతర సమస్యలతో వచ్చిన జెంట్స్ పేషెంట్స్ ను అదే గదిలో ఉంచడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 4నెలల కింద నాలుగు రూమ్స్ కోసం నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇవి స్లాబ్ వరకు పూర్తయి ఆగిపోగా మిగతా పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై డీఎంహెచ్ఓ శిరీషను వివరణ కోరగా త్వరలోనే దవాఖానాను విజిట్ చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.