– ప్రమోషన్స్ లేక అల్లాడుతున్న ఎస్సైలు
– జూనియర్స్ కి సెల్యూట్ చేయలేక అవస్థలు
– భారంగానే సలాంలు
– 2009 బ్యాచ్ ఎస్సైల అవేదనపై తొలివెలుగు స్పెషల్
పోలీస్ శాఖలో చాలామంది ఎస్సైలు అసంతృప్తితోనే పని చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రమోషన్లు లేకపోవడంతో ఇబ్బందికరంగానే జూనియర్లకు సెల్యూట్ చేస్తున్నట్లుగా సమాచారం. 2009 బ్యాచ్ నే ఉదాహరణగా చూస్తే.. అప్పట్లో హైదరాబాద్ రేంజ్ కి మొత్తం 432 మంది ఎంపికయ్యారు. 2018 నుంచి వారిలో 210 మందికి ఇన్ స్పెక్టర్ గా పదోన్నతలు వచ్చాయి. మిగితా 222 మంది ఇంకా సబ్ ఇన్ స్పెక్టర్ గానే కొనసాగుతున్నారు. అయితే.. వరంగల్ రేంజ్ లో పనిచేస్తున్న 2012 బ్యాచ్ ఎస్సైలను సీఐలుగా ప్రమోట్ చేశారు.
ఇటీవల హైదరాబాద్ అసెంబ్లీ బందోబస్తు కోసం వచ్చిన వరంగల్ సీఐలకు ఇక్కడి మూడేళ్ల సీనియర్ అధికారులు సెల్యూట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఎంతో బాధగా, అవమానభారంగా వారంతా సెల్యూట్ చేశారు. ఈ విషయంలో ఎంతో బాధపడుతూ వారంతా ఎక్కడా చెప్పుకోలేకపోతున్నారు. తమకంటే జూనియర్స్ కి సెల్యూట్ కొట్టాలంటే తలవంపుగా ఉందని కొందరు అనుకుంటున్నారట. ఉన్నతాధికారులు తలుచుకుంటే.. ఒక్క రోజులోనే ప్రమోషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. దీనివల్ల ఇన్ స్పెక్టర్ లుగా మారిన 210 మంది మూడు స్టార్ లతో అదే బ్యాచ్ కు చెందిన తాము రెండు స్టార్ లతో తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు.
గతంలో ఎస్‌హెచ్‌ఓ ఎస్సైలే ఉండేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా కమిషనరేట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎస్సై కాకుండా సీఐలే హౌజ్ ఆఫీసర్స్ గా ఉన్నారు. 2012 బ్యాచ్ వారు సీఐలు అయినా… 2009 బ్యాచ్ వారికి ప్రమోషన్ ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వేకెన్సీ లేదని దాటవేస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరిద్దామని ఆలోచించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు 33 జిల్లాలు కావడంతో ఇన్ స్పెక్టర్ పోస్టులను కల్పించడంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎన్నో శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టుల ద్వారా అయినా సీఐలుగా పదవులు కల్పించే అవకాశాలు ఉంటాయి. కానీ.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.
ప్రజా సేవ చేయాలని పోలీస్ ఉద్యోగంలో చేరితే తమపై జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు ఎస్సైలు. నిబద్ధతతో చేయాల్సిన ఉద్యోగాన్ని నిరుత్సాహంతో చేయాల్సి వస్తోందని బాధపడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెడితే 24 గంటల్లో తమ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నారు. గౌరవపదమైన పోలీస్ శాఖలో ‘సెల్యూట్’ భారం కావద్దనేది తమ ఉద్దేశమని వాపోతున్నారు పదోన్నతి పొందని ఎస్సైలు.