హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ టీఆర్ఎస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు బలవుతున్నారని, అవినీతి సర్కార్‌ను ఇంటికి సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ప్రధాని తెలంగాణ సర్కార్‌పైన విమర్శలు చేస్తున్న క్రమంలో కుటుంబ పాలన అనే విషయాన్ని హైలైట్ చేయడం రాజకీయ వ్యూహంలా కనబడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ పాలన అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోందని తెలుస్తోంది.
శ్రీలంక ఉదంతాన్ని ప్రజలు గమనిస్తున్న నేపథ్యంలో రాష్ట్రం కల్వకుంట్ల చేతిలో బందీ అయిందన్న విషయాన్ని ప్రధాని మోడీ చెప్పకనే చెప్పారని అంటున్నారు. అయితే, శ్రీలంకతో తెలంగాణకు పోలిక లేకపోయినా కుటుంబ పాలన అనేది కామన్ పాయింట్‌గా ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తులు కీలక పదవులు అనుభవిస్తు్న్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ప్రధాని భావించినట్లు స్పష్టమవుతోంది.
ఒకే కుటుంబం చేతిలో శ్రీలంక దేశ పాలన కొనసాగడం వలన దేశం చివరకు నాశనమయ్యే పరిస్థితులు వచ్చాయి. అదే పరిస్థితి తెలంగాణలో కూడా జరిగే అవకాశాలుంటాయని, కుటుంబ పాలన వలన రాష్ట్రానికి సమస్యలు వస్తాయనే అవగాహన ప్రజల్లో కల్పించాలనుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ సైతం టీఆర్ఎస్‌తో బస్తీ మే సవాల్ అన్నట్లు ఫైట్ ఇంకా బలంగా కొనసాగిస్తుందనే సంకేతాలను ప్రధాని ఇప్పటికే ప్రజలకు పంపారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ సర్కార్ నిరంకుశ పాలన సాగిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రధాని ఫైర్ అవడం చూస్తుంటే టీఆర్ఎస్‌తో బస్తీ యుద్ధానికి బీజేపీ సై అంటున్నదని స్పష్టమవుతున్నది.