– అతి దూకుడుతో ట్వీట్లు, విమర్శలు
– ఆ అత్యుత్సాహంతోనే తప్పని తిప్పలు
– ఏపీ విషయంలో నవ్వులపాలు
– మొన్న ప్రోటోకాల్ పంచాయితీ..
– అంతకుముందు టెస్లా, బెంగళూరు వివాదాలు
– కేటీఆర్ తీరుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారా?
– సీఎం సీటు అందుకే ఇవ్వడం లేదా?
– రాజకీయ పండితుల విశ్లేషణ
టీఆర్‌ఎస్ లో ఓవర్గం నేతలు కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని తరచూ చెప్పేదే. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రగతి భవన్ లో ఏం జరుగుతుందో ఏమోగానీ.. చివరి దాకా వచ్చి కేటీఆర్ ప్రతీసారి భంగపడుతున్నారనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తుంటాయి. కేటీఆర్ తొందరపాటుతనం వల్లే కేసీఆర్ వెనకడుగు వేస్తున్నారా? అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఏపీ విషయంలో జరిగింది గానీ.. ప్రధాని ప్రోటోకాల్ విషయంలోగానీ.. బెంగళూరు పంచాయితీ గానీ.. ఇలా అనేక విషయాలలో కేటీఆర్ కు అతి దూకుడుతో భంగపాటు తప్పలేదని గుర్తు చేస్తున్నాయి.
ఏపీలో రోడ్లు, కరెంట్, నీళ్లు లేవంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపింది. అక్కడి మంత్రులు వరుసబెట్టి ఆయనపై దండయాత్ర చేశారు. గురివింద కబుర్లు వద్దని ఒకరంటే.. ఏపీకి వచ్చి చూడు అంటూ ఇంకొకరు సవాల్ చేశారు. మరో నేత అయితే.. ఏకంగా సీఎంగా తెలంగాణ ప్రజలు జగన్ ని కోరుకుంటున్నారని అన్నారు. వాళ్ల వ్యాఖ్యలు కొన్ని హాస్యాస్పందంగా అనిపించినా.. చివరకు కేటీఆర్ వివరణ అయితే ఇచ్చుకున్నారు. వెనక్కి తగ్గి తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ఏపీ సీఎంతో సోదరభావం కలిగి ఉన్నామని చెప్పారు. జగన్ నాయకత్వంలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
అనరాని మాటలు అనడం ఎందుకు? పడడం ఎందుకనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. ఏపీలో కేసీఆర్ కు కాస్త ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ తో ఆ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ప్రధాని ప్రోటోకాల్ విషయంలోనూ ఇదే జరిగిందని గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు. ఆమధ్య జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కేటీఆర్. మాటల సందర్భంగా ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్ రావొద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అన్నారు. అంతే.. దీనిపై కేంద్ర వర్గాలు, బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ప్రధాని హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ పాల్గొనకుండా చూడాలని పీఎంవో సందేశం పంపినట్లు కేటీఆర్ చెప్పిందంతా అబద్ధమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. పీఎంవో అలాంటి సందేశం ఏదీ పంపలేదని స్పష్టం చేశారు. ఇదంతా కేంద్రాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ డ్రామాగా బీజేపీ నేతలు మండిపడ్డారు.
కొన్నాళ్ల క్రితం బెంగళూరు విషయంలోనూ ఇలాగే చేసి కేటీఆర్ నవ్వులపాలయ్యారని అంటున్నారు బీజేపీ నేతలు. కర్ణాటకలో మౌలిక సదుపాయాలు లేవు.. తెలంగాణకు వచ్చేయాలంటూ అక్కడి కంపెనీల ఓనర్లను కోరారు కేటీఆర్. దీనికి ఆ రాష్ట్ర సీఎం బసవరాజు బొమ్మై స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. 40 శాతం ఎఫ్డీఏలు కర్ణాటకకే ఉన్నాయని చెప్పారు. సాఫ్ట్ వేర్ రంగంలో తామే ఎక్కువ అభివృద్ధి సాధించామన్నారు. ఇటు టెస్లా విషయంలో కూడా కేటీఆర్ విదేశీ విధానాలపై అవగాహన లేకుండా మాట్లాడారనే విమర్శలు ఉన్నాయి.
ఇక సైదాబాద్ బాలిక హత్యాచార ఘటన సమయంలోనూ నిందితుడి అరెస్ట్ ట్వీట్ తో బాగా ట్రోల్ అయ్యారు కేటీఆర్. ఎంతో అత్యుత్సాహంతో నిందితుడ్ని పట్టుకున్నారని ముందు ట్వీట్ చేసి.. తర్వాత లేదు లేదు.. తాను తప్పు ట్వీట్ చేశానని వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో కేటీఆర్ కు నెటిజన్స్ నుంచి ప్రశ్నల వర్షం ఎదురైంది. మంత్రి హోదాలో ఉండి తప్పుడు ట్వీట్ చేసినందుకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేశారు. ఇలా అనేక విషయాల్లో తొందరపడి మాట్లాడడం.. తర్వాత నాలుక కరుచుకోవడం కేటీఆర్ కు కామన్ అయిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న రాజకీయ పండితులు.. కేటీఆర్ ను ఇందుకే కేసీఆర్ సీఎం చేయడం లేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు. సీఎం అయ్యాక.. ఈ తొందరపాటు తనంతో ఇంకెన్ని సమస్యలు తెచ్చి పెడతాడో అని భయపడుతున్నట్లుగా చెబుతున్నారు.