ఆమధ్య వరకు టీడీపీకి వెన్నుదన్నుగా వున్న టాలీవుడ్ పెద్దలంతా ఒక్కొక్కరుగా చంద్రబాబుకు హ్యాండిస్తున్నారా..? ఐతే, టీఆర్ఎస్‌లో.. మనసు అంగీకరించకపోతే బీజేపీలోనో చేరిపోవడమో, లేక సపోర్టు చేయడమో తప్పదన్నట్టుగా వుంది కొందరు ఇండస్ట్రీ పెద్దల ధోరణి. ధైర్యంగా వొక్కరంటే ఒక్కరు కూడా చంద్రబాబుకు వెనుక మేమున్నామంటూ అండగా నిలబడే వాళ్లు లేకపోవడమే ప్రస్తుతం టాపిక్. పెద్ద నిర్మాత అశ్వినీదత్ కూడా బీజేపీలోకి వెళ్లిపోతున్నారట!
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ బీజేపీలో చేరతారా? హైదరాబాద్‌లో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి వచ్చి ఆయనతో భేటీ కావడంలో ఆంతర్యం అదేనా? టీడీపీతో అనుబంధం ముగిసినట్లేనా ? మోదీ ప్రభుత్వం సాధించిన ఆర్టికల్ 370 విజయ కరదీపికను, ప్రగతి నివేదికను అశ్వినీదత్ ప్రశంసించడం చూస్తే ఇది నిజమేననిపిస్తోంది.
కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అశ్వినీదత్‌ను కలిసి దాదాపు 20 నిమిషాలు సమావేశం కావడం చూస్తే ఇదంతా బీజేపీలో చేరికకు ముందు జరిగిన కసరత్తుగా భావించాల్సి వస్తోంది.
అశ్వినీదత్ అల్లుడు, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత ప్రియాంక దత్‌లను ప్రహ్లాద్ జోషి అభినందించడం, మావైపు నుంచి మీ ప్రభుత్వానికి అన్నివిధాలుగా సహకారాలు వుంటాయని తర్వాత అశ్వినీదత్ చెప్పడం చూస్తుంటే ఇది దేనికి సంకేతం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ కూడా అశ్వినీ కుటుంబం చేస్తున్న కళాసేవను మెచ్చుకున్నారు. ‘మహానటి’ చిత్ర గొప్పతనాన్ని ప్రశంసించారు. అశ్వినీదత్ నిర్మించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు.
చివర్లో అశ్వీనీదత్ ఏమన్నారంటే… ‘నాకు గొప్ప అవకాశం లభించింది. మా నుంచి ప్రభుత్వానికి అన్ని రకాల సహకారాలుంటాయని ప్రహ్లాద్ జోషికి చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై దృష్టి సారించాలని మోదీ ప్రభుత్వాన్ని కోరాం. దేశం మొత్తం మోదీ పనితీరును ప్రశంసిస్తోంది. ప్రధాని మోదీ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం మనకు గర్వకారణం. కశ్మీర్ మనదని చాటారు. దేశం కోసం మోదీ ఇలాంటి ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. ఆనాడు మాజీ ప్రధాన మంత్రి, దివంగత నేత వాజ్‌పాయ్ పాలనలో గొప్ప పరిపాలన చూశాం. మళ్లీ మోదీ హయాంలో చూస్తున్నాం. జీఎస్టీ విషయంలో మేం సూచించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సహకరించారు. మోదీకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలి.’ అని చెప్పుకొచ్చారు.