– ప్రజారాజ్యంపై ఎన్వీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
– ఆనాటి అసలు నిజాలను బయటపెట్టిన నిర్మాత
వెండితెరపై రారాజు మెగాస్టార్ చిరంజీవి. కానీ, రాజకీయాల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీరోగా మిగిలిపోయారు. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. వరుసగా సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే, చిరు నటించిన తాజా పొలిటికల్ డ్రామా చిత్రం గాడ్ ఫాదర్. రాజకీయాలతో ముడిపడిన కథ కావడంతో మెగాస్టార్ పాత విషయాలన్నీ తెరపైకి వస్తున్నాయి. దీనికి తోడు మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ కీలక విషయాలను వెల్లడించారు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత చిరంజీవి చాలా సఫర్ అయ్యారని అన్నారు. అందులో తామూ భాగమేనని తెలిపారు. తిరుపతి ఎలక్షన్స్ ఎలా చేశామన్నది చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ తెలుసని అన్నారు. చిరంజీవి అమ్ముడు పోయాడు అనే ఆరోపణలపైనా స్పందించారు ఎన్వీ ప్రసాద్. చెన్నైలో ప్రసాద్ ల్యాబ్ పక్కనుండే కృష్ణా గార్డెన్ అనే ప్రాపర్టీ అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసేముందు అప్పులన్నీ తీర్చారని వివరించారు.
అంత పెద్ద ప్రాపర్టీ అమ్మి అందరికీ డబ్బులు ఇచ్చిన చిరంజీవి అమ్మడు పోయారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పని చేసే వ్యక్తి గురించి ఎవరుపడితే వారు మాట్లాడటం, ఏదంటే అది రాయడంపై అసహనం వ్యక్తం చేశారు. దమ్ముంటే తన గురించి రాయాలని దేనికైనా రెడీ అంటూ సవాల్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పైనా మాట్లాడారు ఎన్వీ ప్రసాద్.
చిరుని ఏమన్నా ఆయన భరిస్తాడు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్డుపైకి వస్తారని చెప్పారు. ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే జనసేన అంటూ వ్యాఖ్యానించారు. దయచేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు.. రాసే ముందు ఒక సెకెండ్ ఆలోచించండి అంటూ సూచించారు నిర్మాత ఎన్వీ ప్రసాద్.