మరికొన్ని గంటలు.. ఇంకా చెప్పాలంటే మరో 24 గంటల్లో.. టాలీవుడ్ లో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. విప్లవాత్మక నిర్ణయాలు వెలువడనున్నాయి. అవును.. రేపు అంటే 23వ తేదీన టాలీవుడ్ లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మాతల మండలి సభ్యులంతా సూత్రప్రాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిపై తుది చర్చలు జరిపి, ఆ నిర్ణయాల్ని బహిర్గతం చేయబోతున్నారు.
రెమ్యూనరేషన్లు.. షూటింగ్స్..
టాలీవుడ్ రెమ్యూనరేషన్లపై చాలా వాదనలు వినిపిస్తున్నాయి. నాన్-థియేట్రికల్ రేట్లు పెరగడంతో హీరోలంతా తమ పారితోషికాలు పెంచేశారు. వీళ్లను చూసి క్యారెక్టర్ ఆర్టిస్టులు, వాళ్లను చూసి దర్శకులు కూడా తమ రెమ్యూనరేషన్లు పెంచేశారు. దీంతో బడ్జెట్ లో సగం వీటికే పోతోంది. ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఈ మేరకు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయితే.. ఎవరి పారితోషికాల్లో కోత విధించాలి, ఎంత విధించాలి లాంటి అంశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. రేపటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టికెట్ రేట్లపై కీలక నిర్ణయం..
మరోవైపు టికెట్ రేట్లపై నిర్మాతలంతా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చేశారు. విక్రమ్, మేజర్ సినిమాలకు ఏ తరహా టికెట్ రేట్లు అమలు చేశారో.. దాదాపు అవే రేట్లను భవిష్యత్తులో కొనసాగించాలని తీర్మానించారు. ఈ మేరకు దిల్ రాజు ఈ నిర్ణయాన్ని అమలుచేశారు కూడా. తాజాగా రిలీజైన థాంక్యూ సినిమాకు తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 200 రూపాయల టికెట్ రేట్లు ఉన్నాయి. భవిష్యత్తులో దాదాపు అన్ని చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు ఇవే రేట్లు కొనసాగే అవకాశం ఉంది. పెద్ద సినిమాలకు మాత్రం రేట్లు పెరుగుతాయి. దీనికి సంబంధించి కూడా రేపు కీలక ప్రకటన రానుంది.
ఫెడరేషన్ సమస్యలు.. సినీ కార్మికుల సమ్మె..
మరోవైపు ఫెడరేషన్ సమస్యలు, సినీ కార్మికుల ఆందోళనలు ఉండనే ఉన్నాయి. తమకు తక్షణం జీతాలు పెంచాలని సినీ కార్మికులు ఆమధ్య రోడెక్కిన సంగతి తెలిసిందే. వీళ్ల సమస్యల్ని పరిష్కరించేందుకు దిల్ రాజు అధ్యక్షతన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేశారు. ఆ కమిటీ చర్చలు కూడా పూర్తయ్యాయి. వాటిని నిర్మాతల మండలి చర్చల్లో కలిపారు. అంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని కూడా రేపు వెల్లడించబోతున్నారు.
ఫైటర్స్ అసోసియేషన్ సమస్యలు..
దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్నాయి ఫైటర్స్ అసోసియేషన్ సమస్యలు. స్థానికంగా ఉన్న ఫైటర్లకు అవకాశం ఇవ్వాలని, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని వీళ్లు డిమాండ్ చేస్తున్నారు. అసలే తమకు తక్కువ వేతనాలు ఉన్నాయని, ఇలాంటి టైమ్ లో ఆ వేతనాల్ని కూడా దూరం చేస్తూ తమిళ-కన్నడ ఫైటర్లను తెచ్చుకోవడం భావ్యం కాదని వీళ్లు కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ అంశంపై కూడా రేపు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
కాల్షీట్లు.. మేనేజర్ల వ్యవహారం
పైకి కనిపించని మరో సమస్య మేనేజర్ల వ్యవహారం. కాల్షీట్ల మతలబులు. చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒక రోజును 2 కాల్షీట్లుగా విడగొడుతున్నారు. అలా 2 రోజుల సంపాదనను, ఒకే రోజు ఆర్జిస్తున్నారు. అటు మేనేజర్లతో మరో తలనొప్పి. పెద్ద హీరోల్ని మినహాయిస్తే, మిగతా హీరోలు, నటీనటుల పారితోషికాల్ని పెంచడంలో వీళ్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనికితోడు కమీషన్ల వ్యవహారం కూడా ఎక్కువగానే నడుస్తోంది. పారితోషికాలకు, కాల్షీట్లకు, మేనేజర్లకు మధ్య లింక్ ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారాన్ని కూడా గాడిలో పెట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
ఇలా టాలీవుడ్ కు చెందిన కీలకమైన అంశాలపై నిర్మాతలు చర్చలు జరిపారు. వీటిలో ఎన్ని సమస్యలపై కీలక నిర్ణయాలు వెలువడతాయనేది రేపు తెలుస్తుంది.