యూపీ సర్కార్‌తో అల్లు అరవింద్ 'డీల్'

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యూపీ ఇన్వెస్టర్స్ సమిట్’లో పెట్టుబడుల కోలాహలం క్లయిమాక్స్ కొచ్చేసింది. కార్పొరేట్ రంగంలో అతిరధ మహారధులందరూ ఈ భాగస్వామ్య సదస్సులో పార్టిసిపేట్ చేస్తూ యూపీ సర్కార్ కి బాసట తెలుపుతున్నారు. ఇదే వేదికపై టాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అరవింద్ పేరు కూడా ‘సౌండ్’ చేసింది. ఎలాగంటారా?.. చూడండి.

వసూళ్ల పరంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ట్రెండ్ సెట్ చేసిన ‘బాహుబలి’ మూవీ.. మేకింగ్ కాస్ట్ విషయంలో కూడా సరికొత్త ఎత్తుల్ని పరిచయం చేసింది. దాన్నొక గీటురాయిగా తీసుకుని.. తర్వాతి సినిమాలు సైతం వందల కోట్ల ఖర్చుతోనే రూపొందడం మొదలైంది. ఈక్రమంలోనే.. వెయ్యికోట్ల ‘మహాభారతం’ అంటూ వార్తలొచ్చాయి. ఆ తర్వాత.. 500 కోట్ల బడ్జెట్ తో ‘రామాయణాన్ని’ తెరకెక్కించడానికి మరో ప్రయత్నం మొదలైంది. త్రీడీ ఫార్మట్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించడానికి ముందస్తు సన్నాహాలు జరుగుతున్నాయి. మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దీన్ని నిర్మించబోతున్నారు. రామాయణాన్ని భారీ కాన్వాస్‌పై విజువల్ వండర్‌గా తెరకెక్కించాలన్నది వీళ్ళ ప్రయత్నం. ఇందుకోసం యూపీ సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు నిర్మాతలు.

యూపీ ఇన్వెస్టర్స్ సమిట్-2018 ఫోరమ్ మీద.. ‘రామాయణం’ మేకర్స్ కీ.. యూపీ సినిమాటోగ్రఫీ విభాగం ‘ఫిలిం బంధు’కీ మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. అల్లు అరవింద్ కో-ప్రొడ్యూసర్ గా నిర్మితమయ్యే ఈ భారీ చిత్రానికి షూటింగ్ పరంగా పూర్తి సహకారం అందిస్తామని ఉత్తరప్రదేశ్ సర్కార్ హామీ ఇచ్చింది. కొన్ని కీలక దృశ్యాలు అయోధ్యలో షూట్ చేసే ప్రతిపాదన ఉండడంతో.. అనుమతులు, లా అండ్ ఆర్డర్ లాంటి అంశాల్లో సర్కారీ తోడ్పాటు అవసరం. ఈ డీల్ అసలు ఉద్దేశం ఇదేనని తెలుస్తోంది. టెక్నికల్ క్రూ, కాస్టింగ్ లాంటి విషయాల్లో ఇప్పటివరకూ ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ.. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ మొదలుకావచ్చని మేకర్స్ చెబుతున్నారు. గతంలో మధు మంతెన, అల్లు అరవింద్ కలిసి ‘గజనీ’ హిందీ వెర్షన్ తీసిన అనుభవం వుంది.