సోమవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు 150 మందితో మౌన దీక్ష చేపడతామని కోదండరాం ప్రకటించారు.
ఈ నెల 31న కాన్సిట్యూషన్ క్లబ్ లో కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహించనున్నట్లు, ఈ కార్యక్రమానికి యోగేంద్రా యాదవ్ లాంటి చాలా మంది వక్తలు కేసీఆర్ పాలన మిగిల్చిన నష్టంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారన్నారు. పబ్లిక్ రంగ సంస్థలు, రాష్ట్ర స్థాయి సంస్థల విభజన ఇంకా జరగలేదు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ లో కీలక అంశాలు ఉన్నాయని.. 9 ఏళ్లుగా వాటిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, పారిశ్రామిక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అడగకపోవడంతో కేంద్రం పట్టించుకోలేదన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఏ అంశం అమలు కాలేదన్నారు. కృష్ణా నదీ జలాల్లో 170 టీఎంసీల నీరు మాత్రమే తెలంగాణకు దక్కిందని.. ప్రస్తుతం ఉన్న నీటి వాటాతో పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేయడం అసాధ్యమన్నారు.
నీటి వాటాలో రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న అసమానతలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగుతున్నాయన్నారు. ఈ దుస్థితిని రూపు మాపడానికి ప్రజలుగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు కోదండరాం.