తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ప్రొఫెసర్ హర గోపాల్ ఆరోపించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, భూస్వామ్య భావజాలంతోనే ఆయన విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పేద పిల్లలు చదువుకునే విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న ఉపాధ్యాయుల మహాధర్నాలో హరగోపాల్ పాల్గొని మాట్లాడారు.
ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడి పాఠశాలలను పరిశీలించి వచ్చారే తప్పా ఇక్కడ చేసింది ఏమీ లేదని విమర్శించారు. 50 ఏళ్ళ తరువాత రాష్ట్ర చరిత్ర తిరిగి చూస్తే విద్యా రంగానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీగా టీఆర్ ఎస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ధ్వజమెత్తారు.
విద్యను వ్యాపారంగా చేసిన పాలకులు ఏం సాధించారని ప్రశ్నించారు. యాదగిరి గుట్టకు కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలలకు ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించడం లేదని నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తే దేశ జీడీపీ కూడా పెరుగుతుందని అన్నారు.
ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించాలని సూచించారు.