– ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు
– బీఆర్ఎస్ లో ఏపీ నేతల చేరికపై అనుమానాలు
– ఆస్తులు కాపాడుకునేందుకేనని వ్యాఖ్య
– ప్రజల అభిప్రాయం లేకుండా బీఆర్ఎస్ ఎలా ప్రకటిస్తారు
– జేఏసీ పునః ప్రారంభించాలని సూచన
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ తహతహలాడుతున్నారు. నెక్ట్స్ రాబోయే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈనెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా చెబుతున్నారు. కొందరు జాతీయ నేతలకు కూడా ఆహ్వానం పంపారు. ఆ సభా ఏర్పాట్లలో జిల్లాలో నేతలు తలమునకలయ్యారు. అయితే.. బీఆర్ఎస్ విస్తరణ కోసం కేసీఆర్ ప్రముఖంగా దృష్టి సారించింది ఆంధ్రప్రదేశ్ పైనే. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు.
ఏపీలో పార్టీ ఆఫీస్ ను కూడా ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. తెలంగాణ వాదాన్ని వదిలేసి కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేస్తుండడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం జలదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. కోదండరాం చేపట్టిన జల దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెడతారని ప్రశ్నించారు హరగోపాల్. తెలంగాణలోని సంపదను రక్షించుకునేందుకే ఆంధ్రా నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ సర్కార్ నిర్వీర్యం చేసిందని అన్నారు. రాష్ట్ర ఆకాంక్షలను కేసీఆర్ విస్మరించారని, ముఖ్యమంత్రికి చారిత్రక, ఉద్యమ స్ఫూర్తి లేదని విమర్శించారు.
తెలంగాణ ప్రజలను మళ్ళీ సమీకరించుకునే పరిస్థితులు వచ్చాయని.. జేఏసీ పునః ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు హరగోపాల్. చంద్రబాబు, షర్మిల తెలంగాణలో అధికారం కోసం సభలు, సమావేశాలు నిర్వహస్తున్నారని వివరించారు. అలాగే తెలంగాణలో అధికారంలోకి వచ్చి హిందూ రాష్ట్రం చేయాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యంగా పని చేస్తోందని.. హిందూ రాష్ట్రం అంటే ఏంటో వారికే తెలియదని ఎద్దేవ చేశారు. కృష్ణా నదీ జలాలపైనే ఎక్కువ వివాదం ఉందని గుర్తు చేశారు హరగోపాల్. తెలంగాణ ఏర్పాటులో జేఏసీ పాత్ర చాలా కీలకమైంది. ఈ నేపథ్యంలో దాన్ని పునః ప్రారంభించాలని హరగోపాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.