మెదక్ లో దారుణం చోటు చేసుకుంది. చేగుంట మండలం వడియారంలో అక్కపై చెల్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. పుట్టింటి తరుపు ఆస్తి పంపకాల విషయంలో జరిగిన వివాదం ఈ దారుణానికి కారణం అయింది.
కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన ధర్మగౌని రాజాగౌడ్‌కు నలుగురు కుమార్తెలు. కుమారులు లేకపోవడంతో ఆయనకు చెందిన ఐదెకరాల భూమి పంచుకునేందుకు కొన్ని రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో వరలక్ష్మీ, రాజేశ్వరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
వరలక్ష్మి వడియారం గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటుంది. సోమవారం వరలక్ష్మి ఇంటికి రాజేశ్వరి వచ్చింది. వారిద్దరి మధ్య ఆస్తి విషయమై వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన రాజేశ్వరి అక్క వరలక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. వెంటనే వరలక్ష్మీ.. చెల్లెలు రాజేశ్వరీ ని కూడా గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ఇంట్లో ఉన్న వరలక్ష్మి పిల్లలు గట్టిగా అరవడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశారు. తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరో ప్రైవేటు అంబులెన్స్‌లో రాజేశ్వరిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.