డాక్టర్ అంటే రోగులకు పరీక్షలు చేస్తూ, వారి వ్యాధికి అనుగుణంగా మందులు ఇస్తుంటారు. కానీ రాజస్థాన్‌లో ఓ డాక్టర్ మాత్రం పానీ పూరీ అమ్ముతూ కనిపిస్తున్నారు. అది కూడా ఆస్పత్రికి తాళం వేసి అక్కడే పానీ పూరి అమ్ముతున్నారు. అయితే దీని వెనుకు ఓ కారణం ఉంది. అసలు ఏం జరిగిందంటే..?
రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ సర్కార్ ఇటీవల కొత్త ఆరోగ్య బిల్లు తీసుకు వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బిల్లుపై వైద్యులు నిరసనలు తెలుపుతున్నారు. బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులంతా ఆందోళన బాట పట్టారు.
ఈ క్రమంలో సీకార్కు చెందిన డాక్టర్ అనిత అనే వైద్యురాలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాను పని చేస్తున్న ఆస్పత్రికి తాళం వేసి అక్కడే ఓ పానీ పూరి దుకాణం పెట్టారు. ఆస్పత్రి బోర్డుకు బదులుగా పానీ పూరీ దుకాణం బోర్డును పెట్టారు.
ఆ బోర్డుపై తన పేరు అనితా పుచ్కావాలీ అని, ఇప్పుడు తాను మాజీ ప్రైవేట్ డాక్టర్ అని రాశారు. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం ‘రైట్ టు హెల్త్ బిల్’ను ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రతి పౌరుడూ ఎలాంటి ఛార్జీలు లేకుండా ఏ ఆస్పత్రిలోనైనా అత్యవసర చికిత్స పొందవచ్చు. దీనిపై ప్రైవేట్ ఆస్పత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.