మిడ్ మానేరు ముంపు బాధితులు కదం తొక్కారు. ఎమ్మెల్యే రమేష్ బాబు గెస్ట్ హౌస్ ను ముట్టడించారు. మెయిన్ గేట్ దగ్గర పోలీసులు ఉండడం గమనించి వెనుక నుంచి గోడ దూకి లోపలికి వెళ్లారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోనరావుపేట పీఎస్ కు తరలించారు. తమకు ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ అయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. ఎన్నో రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నామని.. ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఆరోపించారు.
చాలామంది నిర్వాసితులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. సమస్యలన్నింటికీ అఖిలపక్ష నేతలు కారణం అంటూ ఎమ్మెల్యే రమేష్ బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే అలా మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిర్వాసితుల పోరాటాన్ని అవహేళన చేసిన రమేష్ బాబు ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయడం లేదని ఆరోపించారు.
ఇప్పటిదాకా తమ కోసం ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని నిలదీశారు మిడ్ మానేరు బాధితులు. నిరుద్యోగులు ఉపాధి లేక అవస్థలు పడుతుంటే.. అదంతా ఎమ్మెల్యేకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఇంతవరకు పట్టా లేదు, ప్యాకేజీ లేదు.. ఉపాధి కల్పించలేదు.. నిరసనలు చేస్తామని పిలుపునిస్తే చాలు హౌస్ అరెస్టులు.. ఇంకా ఎన్నాళ్లు తాము ఎదురుచూడాలని మండిపడ్డారు. న్యాయం జరిగే వరకు వదిలేది లేదని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు నిర్వాసితులు.