– ప్రగతి భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్
– పోడు సమస్యల పరిష్కారం కోసం ధర్నా
– ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు చూసిన నేతలు
– అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత
పోడు భూముల విషయంలో గిరిజనులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. పట్టాలిస్తానన్న సారేమో పట్టించుకోవడం లేదు. సాగు చేద్దామంటే ఫారెస్ట్ అధికారులు అంగీకరించడం లేదు. కాదని వారిస్తే.. గొడవలు, దాడులు. తర్వాత అరెస్టులు, కేసులు. పంటసాగు కోసం గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఈ నేపథ్యంలో సీపీఐఎంఎల్, పీడీఎస్ నేతలు నిరసన బాట పట్టారు.
పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో కేసీఆర్ నివసిస్తున్న ప్రగతి భవన్ ను ముట్టడించారు. అలాగే గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పొడు భూముల రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలని సీపీఐఎంఎల్, పీడీఎస్ నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా భూముల రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. తరచూ గిరిజనులు అరెస్టు అవుతున్నారని.. ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. వీరి ముట్టడి కార్యక్రమంతో ప్రగతి భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది.