మేడ్చల్ జిల్లా బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లో ప్లాట్లు, ఇళ్ల ఓనర్లు ధర్నాకు దిగారు. వక్ఫ్ బోర్డు సాకుతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను నిలిపివేశారని.. వెంటనే తిరిగి వాటిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వీరి పోరాటానికి బీజేపీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని సుమారు 14 డివిజన్లలో ప్లాట్లను.. వివిధ ప్రాంతాల వారు కొనుగోలు చేశారు. కొంత మంది ఇళ్లు కట్టి క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అయితే గత మూడేళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు.
ఎంఐఎం పార్టీ మెప్పుకోసం పేద ప్రజలను బలిచేస్తారా అని ధర్నాలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికలు వచ్చినప్పుడు సమస్యలు తీర్చుతామని హామీ ఇచ్చి.. అయిపోయాక పత్తా లేకుండా పోతున్నారని మండిపడ్డారు. ఇక్కడి సమస్యలు తీర్చుతామని ఎన్నికల్లో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి, బొడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రిజిస్ట్రేషన్లు, ఎల్ఆర్ఎస్ అంటూ సుమారు వంద కోట్లు చెల్లించుకున్న ప్రభుత్వానికి.. ఎల్ఆర్ఎస్ ఫీజు తీసుకునే సందర్భంలో ఇది వక్ఫ్ బోర్డు భూమి అనేది గుర్తుకురాలేదా అని నిలదీశారు. ఈ నెలలో సమస్యను పరిష్కరించపోతే రాబోయే రోజుల్లో బొడుప్పల్ కార్పొరేషన్ లో మంత్రిని తిరగనివ్వమని హెచ్చరించారు. తమ సమస్య తీరే వరకు ఉద్యమిస్తామన్నారు స్థానిక ప్రజలు.