రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్ ఆలోచన దుర్మార్గమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇందిరా పార్కు దగ్గర ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం మార్చడం కేసీఆర్ కాదు కదా.. ఆయన జేజెమ్మ వల్ల కూడా కాదన్నారు. ఎస్సీల్లో 57 ఉప కులాలు ఉన్నాయని.. వాటిలో చాలావరకు గుర్తింపు లేనివి ఉన్నట్లు వివరించారు. కేసీఆర్ అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శించారు.
‘‘ధర్నా చౌక్ ఎత్తివేసిన రోజు.. మళ్లీ దీని అవసరమే ఉండదన్నారు.. దళితులను సీఎం చేస్తానని మాట తప్పారు. పైగా తానే సీఎంగా ఉండాలని దళితులు కోరినట్లు చెప్పుకున్నారు. ఇప్పటికే అనేకమార్లు చెప్పా.. మళ్లీ చెప్తున్నా.. కేసీఆర్ మాటలు తెనేకారినట్టు ఉంటాయి. ఆయనకు ప్రజల మీద ప్రేమ కాదు ఓట్ల మీదే ఉంటుంది. దళితుల కోసం దళిత బంధు రాలేదు.. నా గొంతు నొక్కడానికి తెచ్చారు. కేసీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నా.. రూ.17 వేల కోట్లు ఖర్చు పెడితే ముక్కు నేలకు రాస్తా. దళితబంధు పూర్తిగా అందాలి అంటే సంవత్సరానికి లక్ష కోట్లు కావాలి. 20 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉంటారా? మాట ఇచ్చిన ప్రకారంగా దళిత బంధు అందరికీ అందించాలి’’ అని అన్నారు.
సీఎం 20 రోజులు పడుకుంటే ఈ రాష్ట్రం ఏమై పోవాలని ప్రశ్నించారు ఈటల. పాలన పట్టించుకోని సీఎం.. కష్టాలు పట్టని సీఎం మనకు అవసరం లేదన్నారు. చిన్న కులాలే అయినా.. చైతన్యానికి ప్రతీక అని.. కొట్లాడి అన్నీ సాధించుకుందామని చెప్పారు. ‘‘చిన్న కులానికి మంత్రి పదవులు ఇవ్వలేదు. గుండెకాయలాంటి మంత్రి పదవులు అన్నీ వారి కులానికి ఇచ్చుకున్నారు. దళితులారా గులాబీల తియ్యటి మాటలకు మోసపోకండి. మాదిగకు ఒకటి, ఉపకులాలకు ఒక మంత్రి పదవి వెంటనే ఇవ్వాలి. 17 శాతం ఉన్న దళితులకు 4 మంత్రి పదవులు ఇవ్వాలి’’ అని డిమాండ్ చేశారు.
ఒక కలెక్టర్, ఆర్డీఓ మీ మాట వినకపోతే మీకు సీఎం కుర్చీలో కూర్చునే అర్హతే లేదని కేసీఆర్ పై మండిపడ్డారు ఈటల. మాదాసి కురువ కులానికి ఎమ్మార్వోలే సర్టిఫికెట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఆఖరికి కుల సర్టిఫికెట్ కోసం కూడా కొట్లాడాల్సి వస్తుందన్న ఆయన.. 57 కులాలకు గెజిట్ చెప్పినట్టు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈటల నాలుగు డిమాండ్స్
1. ఉపకులాలకి జనాభా ప్రాతిపదికన ఆర్థిక ఫలాలు అందాలి
2. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి
3. రూ.10 లక్షలు దళిత బంధు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ఇవ్వాలి
4. నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలి