దేశవ్యాప్తంగా అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇవి సద్దుమణగగా.. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కమిటీకి చెందిన నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అల్లర్లతో భారతదేశం బలహీనం కావాలనే కుట్ర జరుగుతోందని జాతీయ మీడియాతో అన్నారు.
అగ్నిపథ్ పై అపోహలు వద్దని కేంద్రం ఎంత మొత్తుకుంటున్నా.. వినకుండా జరుగుతున్న అల్లర్లపై ఓ ఆర్‌ఎస్‌ఎస్ నేత మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి. ఈ నిరసనలు విదేశీ శక్తుల ప్లానింగ్ లో ప్రణాళికాబద్దంగా జరుగుతున్నాయని.. దానికోసం నిధులు కూడా సమకూరుతున్నాయనేది ఆయన ప్రధాన ఆరోపణ.
ఇక మరో సీనియర్ నేత మాట్లాడుతూ.. భవిష్యత్ సవాళ్లు, సరిహద్దు సంక్షోభాలను ఎదుర్కోవటానికి యువ సైన్యం అవసరమని అభిప్రాయపడ్డారు. భారత సైన్యం అభివృద్ధి కోసం అగ్నిపథ్ ను తీసుకొచ్చారని చెప్పారు. “మనది యువ దేశం. ఆ యువశక్తిని గరిష్టంగా ఉపయోగించుకోవాలి” అని అన్నారు.
మరోవైపు అగ్నిపథ్ అంశంపై ఆర్‌ఎస్‌ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని.. ఆ సంస్థ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. “దేశానికి జాతీయ భద్రత అత్యున్నతమైంది. ఈ పథకాన్ని భద్రతాపరమైన ఆందోళనగా చూడాలి” అని చెప్పారు.
అగ్నిపథ్ 17.5 నుండి 21 సంవత్సరాల వయసు గల యువకులను సైన్యంలోకి తీసుకొచ్చే పథకం. దీనిద్వారా నాలుగు సంవత్సరాల ఒప్పందంతో వారిని చేర్చుకుంటారు. వీరిని అగ్నివీర్స్ అని పిలుస్తారు. అయితే.. ప్రభుత్వం 2022లో రిక్రూట్ మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది. ఈ అగ్నివీరులందరికీ నాలుగేళ్ల తర్వాత రెగ్యులర్ కేడర్ లో చేరేందుకు అవకాశం ఇచ్చారు. ఒక్కో బ్యాచ్ నుంచి 25 శాతం మంది మాత్రమే సాయుధ దళాల రెగ్యులర్ కేడర్ లోకి వెళ్తారు. మిగిలిన వారికి వారివారి ఇంట్రస్ట్ ని బట్టి రాయితీలతో డెవెలప్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది కేంద్రం.