ఖమ్మం సభకు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చారని బీఆర్ఎస్ బడా నేతలు చెబుతున్నారు. కానీ, జనాన్ని సమీకరించి.. డబ్బులు ఆశచూపి తీసుకొచ్చారని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనతో తేలిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ మీటింగ్ కి తీసుకుపోయిన వారికి డబ్బులు ఇవ్వలేదని పార్టీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు ప్రజలు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఇది కొనసాగింది. గార్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎదుట ఈ ఆందోళన జరిగింది.
ఖమ్మంలో జరిగిన భారీ సభకు వెళ్లేందుకు ప్రజలను పెద్ద ఎత్తున తరలించారు. మనిషికి రూ.200 ఇస్తానని అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు ఒప్పుకున్నారు. అయితే.. మీటింగ్ కు వెళ్లి వచ్చాక వాహనాలు దిగగానే ఇస్తామని చెప్పిన డబ్బు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు.
సుమారు 5వేల మందికి డబ్బులు ఇస్తామని ఇవ్వలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూలీ పనులు బంద్ చేసి వెళ్లామని.. 200 ఇస్తామని చెప్పి వచ్చాక 100 ఇస్తామంటున్నారని మండిపడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని పస్తులు వుండి గ్రామానికి తిరిగొచ్చామని చెబుతున్నారు.