ప్రసవం కోసం వెళ్లిన మహిళకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు చేసిన నిర్వాకం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. మొయినాబాద్ మండలం చిలుకూరుకు చెందిన దండు మంగమ్మ అనే మహిళకు 10 రోజుల క్రితం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు అమ్లాపూర్ కూడలిలోని భాస్కర్ హాస్పిటల్ కు తరలించారు. ప్రసవ నొప్పులు ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేసిన డాక్టర్లు..ఓ గుడ్డ ముక్కను కడుపులో ఉంచి కుట్లు వేశారు. ఓ నాలుగు రోజుల తర్వాత ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లినప్పటి నుండి ప్రతీ రోజు కడుపు నొప్పితో బాధపడుతుండేది. 10 రోజులు తర్వాత కడుపులో నొప్పి ఎక్కువ కావడంతో.. బాలింతను భర్త మాణిక్యం మళ్లీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కుట్లకు చీము వచ్చింది. కడుపులో నీటి బుడగలు వచ్చాయి. ఉస్మానియాకు తీసుకెళ్లమని సూచించారు. భయపడిన బాలింత కుటుంబ సభ్యులు సంగారెడ్డిలోని మరో ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ తీస్తే అసలు విషయం బయటపడింది. కడుపులో కాటన్ గుడ్డ ఉందని, ఆపరేషన్ చేసి తీయాలని డాక్టర్లు తెలిపారు. దీంతో కంగు తిన్న బాధితురాలి కుంటుంబ సభ్యులు ప్రసవం చేసిన హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. అధికారులు స్పందించి.. హాస్పిటల్ నిర్వాహకులు, ఆపరేషన్ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.