ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే కర్నాటకలోని శివమొగ్గ.. భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యతో భగభగలాడుతోంది. భారతి కాలనీలో హర్షను వెంటాడి హతమార్చి పరారయ్యారు దుండగులు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హర్ష హత్యను ఖండిస్తూ బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు, ఇతర హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళనలకు దిగారు.
భారతి నగర్ లో మొదలైన అల్లర్లు నగరమంతా వ్యాపించాయి. పైగా హర్ష అంతిమ యాత్రలో దుండగులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దాదాపు 20 దుకాణాలను ధ్వంసం చేశారు. ఓ మినీ లారీ, నాలుగు బైక్స్ కు నిప్పుపెట్టారు. పోలీసులు అల్లర్లను అదుపు చేసేందుకు నగరమంతటా 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఘటన రాజకీయంగానూ మాటల యుద్ధానికి దారి తీస్తోంది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.
ఇక హర్ష హత్యను నిరసిస్తూ తెలంగాణలోని హన్మకొండ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు. సువిశాలమైన భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందుత్వం కోసం పని చేస్తున్నవారిని హత్య చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకొని.. హత్యలను, వారి అరాచకాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
హర్ష హత్యకేసులో నిందితును ఉరి తీయాలని డిమాండ్ చేశారు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు. ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న వారిని కూకటివేళ్ళతో సహా ఎరిపారేయలన్నారు. దేశంలో జిహాదీ మూకలు కేరళ, బెంగాల్, తమిళనాడు, కర్నాటకలో వరుస హత్యలకు పాల్పడుతున్నాయని చెప్పారు. అలాగే ఉగ్రవాద కార్యకలపాలను పెంచిపోషిస్తున్నాయని.. వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణలో కూడా భైంసా అల్లర్ల వెనుక ఆయా సంస్థల హస్తం ఉందని ఆరోపించారు. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వారిని వదిలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. హర్ష హత్యపై సీబీఐ ఎంక్వైరీ జరిపించి నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరారు.